తెలంగాణకు కేంద్రం నుంచి రూ. 1087 కోట్లు

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసింది. మొత్తం రూ.46,038 కోట్లు విడుదల చేయగా ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి రూ.982 కోట్లు వచ్చింది.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ వాటాను కేంద్రం విడుదల చేసింది గత నెలలో కూడా రాష్ట్రానికి రూ.982 కోట్లు పన్నుల వాటా లభించింది. రాష్ట్ర వాటా 2.133 శాతంగా ఉంది. 

ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు రూ.105.25 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ ముందస్తు నిధులు విడుదల చేసింది. 10 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నిధులను వినియోగించాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది.

ఎటువంటి కోత లేకుండా పది పని రోజుల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రభుత్వం ఈ నిధులను పట్టణ స్థానిక సంస్థలకు అందించాలని ఆదేశించింది. ఆలస్యమైతే అంతకు వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

రాష్ట్రంలో జిహెచ్‌ఎంసి మినహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికి ఈ నిధులు అందనున్నాయి. వీటిని ఎష్టాబ్లిష్‌మెంట్ వ్యయానికి, జీతాలకు వాడుకోరాదని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.5000.02 కోట్లను విడుదల చేసింది. అటు పన్నుల వాటా, ఇటు పట్టణ స్థానిక సంస్థల నిధులు కలిపి మొత్తం రాష్ట్రానికి రూ.1087 కోట్లు అందుతున్నాయి.