భారత సరిహద్దుల్లో చైనా బలగాలు రెచ్చగొట్టే చర్య 

చైనాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. భారత్ సరిహద్దులో గాని, దక్షిణ చైనా సముద్రం కానీ చైనా వ్యవహరిస్తున్న తీరు కలవరపరుస్తోందని అమెరికా విమర్శించింది. భారత్ భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చిన ఘటనల నేపథ్యంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రెచ్చగొట్టేలా చైనా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తుతూ తన శక్తిని చైనా ఏ విధంగా చూపించాలనుకుంటోందని ప్రశ్నించారు. చైనా తీరు అభ్యంతరకరమని స్పష్టం చేశారు. అందువల్లే తాము తమలాంటి భావజాలం కలిగిన ఆసియన్ దేశాలతో కలిసి నడుస్తున్నామని చెప్పారు. అమెరికా, జపాన్, భారత్ లతో  కూడిన త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇదే విధంగా నాలుగు దేశాల కూటమిని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

ఈ నెల ప్రారంభంలో లఢఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో చైనా, భారత్  సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఇదే సమయంలో తూర్పు లఢఖ్ లోకి చైనా హెలికాప్టర్లు కూడా చొచ్చుకొచ్చాయి. అయితే వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత్ సుఖోయ్-30 విమానాలను మోహరించింది.

మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా చైనా కుతంత్రాలకు పాల్పడుతోంది. ఆ ప్రాంతంలోని ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం తదితర దేశాలతో తగువు పెట్టుకుంటోంది. ఈ పరిణామాల పట్ల చైనా ధోరణి పట్ల అమెరికా తీవ్రంగా నిరసన వ్యక్త చేసింది.