చైనాలో భిన్నమైన లక్షణాలతో కరోనా 

కరోనా వైరస్‌ వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తున్నట్టు చైనాలో నమోదవుతున్న కొత్త కేసుల్ని పరిశీలిస్తే నిజమేననిపిస్తున్నది. ఆ దేశంలోని ఉత్తరాది రాష్ర్టాల్లో ఇటీవల నమోదవుతున్న కొత్త కేసులు.. వుహాన్‌లో నమోదైన కేసులతో పోలిస్తే భిన్నమైన లక్షణాల్ని కలిగి ఉన్నాయని చైనా వైద్యులు చెప్తున్నారు. 

జిలిన్‌, హెయిలాంగ్‌జియాంగ్‌ రాష్ట్రాల్లో ఇటీవల వెలుగుచూసిన వైరస్‌ కేసులను పరిశీలిస్తే.. రోగుల్లో వైరస్‌ లక్షణాలు బయటపడటానికి గతంలో కంటే ఎక్కువ సమయం పడుతున్నదని, అలాగే రోగులు వ్యాధి నుంచి కోలుకోవడానికి పట్టే వ్యవధి కూడా ఎక్కువగా ఉంటున్నట్టు ఇటీవల నిర్వహించిన న్యూక్లియిక్‌ యాసిడ్‌ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని చైనాలో ప్రముఖ అత్యవసర చికిత్స వైద్య నిపుణుడు క్యూ హైబో తెలిపారు. 

ఈశాన్య ప్రాంతాల్లో కొత్త వైరస్‌ సోకిన రోగుల్లో ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గమనించామని పేర్కొన్నారు. అయితే, వుహాన్‌లో వెలుగుచూసిన కేసుల్లోని బాధితుల గుండె, మూత్రపిండాలు, చిన్న పేగు, పెద్ద పేగు వంటి పలు అవయవాలపై వైరస్‌ ప్రభావం చూపించిందని వెల్లడించారు. 

రష్యా నుంచి దేశంలోకి వస్తున్నవారి వల్లే ఈ రకమైన కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రష్యాలో ప్రభావం చూపుతున్న వైరస్‌ జన్యు క్రమానికి, ఈ కొత్త వైరస్‌ జన్యు క్రమానికి దగ్గరి పోలికలు ఉన్నట్టు వివరించారు.