9.25%కే ఎంఎస్‌ఎంఈలకు రుణాలు

కరోనా ఉద్దీపనల్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) ద్వారా అందించే ఈ రుణాలపై 9.25 శాతం రాయితీ వడ్డీరేటునే వసూలు చేయనున్నారు. 

కరోనా మహమ్మారి బారినపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకొనేందుకు గత వారం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.21 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే లాక్‌డౌన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల ప్రత్యేక రుణాలను అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 

దీనికి బుధవారం  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అలాగే ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల కోసం ప్రకటించిన రూ.30 వేల కోట్ల ప్రత్యేక ద్రవ్య పథకానికీ ఆమోదం లభించింది. వీటి కోసం పాక్షిక రుణ హామీ పథకం నిబంధనలను ప్రభుత్వం సడలించింది. 

కమర్షియల్‌ మైనింగ్‌కు ఓకే చెప్పిన క్యాబినెట్‌.. సూక్ష్మ శ్రేణి ఆహార శుద్ధి కేంద్రాలకు మద్దతుగా ప్రకటించిన రూ.10 వేల కోట్ల పథకానికీ అనుమతినిచ్చింది. హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై రూ.7.59 కోట్ల వడ్డీ రద్దుకూ క్యాబినెట్‌ సై అన్నది.