డబ్ల్యూహెచ్‌ఓ  చైర్మన్ గా డా. హర్ష వర్ధన్ 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కార్యనిర్వాహక చైర్మన్ గా భారత ఆరోగ్య మంత్రి డా. హర్ష వర్ధన్ మరో రెండు రోజులలో ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో జపాన్  చెందిన డా. హీరోకి నాకతని ఉన్నారు. 

ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో భారత్ ప్రతినిధిని చైర్మన్ గా నియమించాలని సూచిస్తూ 194 దేశాలు ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. గత సంవత్సరమే భారత్ ప్రతినిధిని కార్యనిర్వాహక బోర్డు లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరో తొమ్మిది దేశాల ప్రతినిధులతో పాటు భారత్ కు కూడా ఈ కీలకమైన బోర్డు లో సభ్యత్వం లభించింది. కార్యనిర్వాహక బోర్డు లో సభ్యత్వం మూడేళ్లపాటు ఉంటుంది. అయితే చైర్మన్ పదవి మాత్రం ఒకొక్క ఏడాది ఒకొక్క ప్రాంతం వారికి వెడుతుంది. వైద్య రంగంలో అత్యున్నత అర్హతలు గలవారు సాధారణంగా ఈ బోర్డు సభ్యులుగా ఉంటారు. 

ఈ నెల 22న డా. హర్ష వర్ధన్ ఈ పదవికి ఎన్నిక కానున్నారు. ఆరోగ్య అసెంబ్లీ రూపొందించిన విధానాలు, కార్యక్రమాల అమలు బాధ్యత ఈ బోర్డు పై ఉంటుంది. ప్రతి ఏడాది కనీసం రెండు సార్లు సమావేశం జరుపుతుంది. ఆ సమావేశాలకు డా. హర్ష వర్ధన్ అధ్యక్షత వహించవలసి ఉంటుంది. 

భారత్ దేశం కరొనపై జరుపుతున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న డా. హర్ష వర్ధన్ 78వ ఆరోగ్య అసెంబ్లీ సమావేశంలో మే 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ముందస్తుగా భారత్ అవసరమైన చర్యలు తీసుకోగలగడంతో కరోనా కట్టడిలో విజయాలు సాధించ గలుగుతున్నామని తెలిపారు.