ఏపీలో సోషల్ మీడియా పోస్ట్ పెడితే జైలుకే!

ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూనే, కనీసం అనుమానాలు వ్యక్తం చేస్తేనో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్  పెట్టినా లేదా వేరే వారు పంపిన పోస్ట్ ను మరొకరికి పంపినా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల ధోరణి. ఆ మేరకు వరుసగా పలువురికి నోటీసులు జారీచేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. 

విశాఖ గ్యాస్ లీక్ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించారని అంటూ గుంటూరులో ఓ వృద్ధురాలికి సిఐడి పోలీసులు నోటీసు జారీ చేయడం సంచలనం కలిగించింది. ఎల్ జి పొలిమెర్స్ లో ఆధారాలు ధ్వంసం చేసారా? కంపెనీని ఎందుకని సీజ్ చేయలేదు? వంటి ప్రశ్నలను పలువురు నిపుణులు, ప్రతిపక్షాలు వేస్తున్నారు. 

ఇదే అంశాలతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక పోస్ట్‌ను ఫార్వర్డ్‌ చేసిన ‘నేరానికి’ సీఐడీ అధికారులు రంగంలోకి దిగి, రంగనాయకమ్మ అనే 66 సంవత్సరాల వయసున్న వృద్ధురాలికి నోటీసు ఇచ్చారు.

‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దని పదే పదే చెబుతున్నా ఇలాంటివి ఎందుకు చేశారు.? మీ నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష తప్పదు’ అని హెచ్చరించి విచారణకు రావాలంటూ నోటీసు అందజేశారు. కర్నూలు ఎమ్మెల్యే లాక్‌డౌన్‌ నిబంధనలు పట్టించుకోకుండా ఎడాపెడా తిరుగుతున్నారని సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టిన బీజేపీ నేత హరీశ్‌ బాబుకు  సహితం ఎమ్యెల్యే ఫిర్యాదుపై స్పందిస్తూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 

ఇక్కడ విశేషమేమిటంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులపై అధికార పార్టీకి చెందిన వారు చేసిన ఫిర్యాదుల విషయంలో మాత్రమే ఈ వేగం కనిపిస్తోంది. సోషల్‌ మీడియా పోస్టులపై వచ్చే ఫిర్యాదులను సైబర్‌ క్రైమ్‌ విభాగం పరిశీలించాలి.  కానీ, ఏపీలో మాత్రం విచిత్రంగా ఈ ఫిర్యాదులపై సీఐడీ రంగంలోకి దిగుతోంది.