ప్రధాని మోదీని బిల్‌గేట్స్‌ మరోసారి ప్రశంస

ప్రధాని మోదీని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ద్వారా దేశంలో పారిశుద్ధ్యం మెరుగుపడిందని ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘భారత్‌లో పారిశుద్ధ్యం మెరుగుపడినందుకు నరేంద్రమోదీ నాయకత్వం, ప్రభుత్వం ముఖ్య భూమిక పోషించాయి. స్వచ్ఛభారత్‌ విజయాన్ని గుర్తు చేసుకొనే సమయం ఆసన్నమైంది.’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

పారిశుద్ధ్యం విషయంలో మోదీని, ఆయన ప్రభుత్వాన్ని టెక్‌ దిగ్గజం బిల్‌గేట్స్‌ ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు. దేశంలో పోషకాహార లోపం, పారిశుద్ధ్యం కారణంగా రోగాల వ్యాప్తిని తగ్గించినందుకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ గతంలో మోదీ ప్రభుత్వాన్ని అభినందించింది.

2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలో 8 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. 5 లక్షల గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్ఛ దేశాన్ని నెరవేర్చే ఉద్దేశంతో గత సెప్టెంబరులో ప్రధాని స్వచ్ఛతా హీ సేవ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమాన్ని ప్రారంభించారు.