అమల్లోకి  ఈపీఎఫ్‌ చందాల కుదింపు  

ఈపీఎఫ్‌ చందాలను కుదించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న ఈ చందాలను మూడు నెలలపాటు (జులై వరకు) 10 శాతానికి తగ్గిస్తూ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కేంద్ర కార్మికశాఖ నోటిఫై చేసింది. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగుల టేక్‌ హోం శాలరీని పెంచడంతోపాటు పీఎఫ్‌ బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కంపెనీలకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ నిర్ణయం వల్ల రానున్న మూడు నెలల్లో ఉద్యోగులు, కంపెనీల యజమానుల చేతుల్లోకి రూ.6,750 కోట్ల నగదు వస్తుందని అంచనా. ఈపీఎఫ్‌ చందాల కుదింపు ఈ ఏడాది మే, జూన్‌, జులై నెలలకు చెల్లించే వేతనాలకు వర్తిస్తుందని  జారీచేసిన నోటిఫికేషన్‌లో కార్మికశాఖ పేర్కొన్నది.

అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు తమ యాజమాన్య ఈపీఎఫ్‌వోకు ఎప్పటి మాదిరిగానే 12 శాతం చందా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా, ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 24 శాతం ఈపీఎఫ్‌ తోడ్పాటుకు అర్హులైనవారికి పీఎఫ్‌ చందాల కుదింపు వర్తించబోదని కార్మికశాఖ స్పష్టం చేసింది. 

ఏ కంపెనీలో అయినా 100 మందిలోపు ఉద్యోగులుండి, వారిలో 90 శాతం మంది నెలవారీ వేతనాలు రూ.15 వేలలోపు ఉన్నట్టయితే అటువంటి ఉద్యోగులు, కంపెనీల మొత్తం పీఎఫ్‌ చందాలను (ఉద్యోగి వాటా 12 శాతం, యాజమాన్య వాటా 12 శాతం) పీఎంజీకేవై కింద ఆగస్టు వరకు తామే చెల్లించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనివల్ల 72.22 లక్షల మంది ఉద్యోగులకు, 3.67 లక్షల మంది యజమానులకు ఊరట లభిస్తుంది.