ఏక్తా కపూర్‌ పై రాజాసింగ్ ఫిర్యాదు 

బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. బాలాజీ సంస్థ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘అన్ సెన్సార్డ్ సీజన్‌ -2’ వెబ్ సిరీస్ ట్రైలర్‌లో ఆర్మీ యూనిఫామ్‌ను కించపరిచేలా సన్నివేశాలుండటమే దీనికి కారణం.

తాజాగా పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసిన ఆయన.. ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఏక్తాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 

బాలాజీ టెలీఫిలింస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన.. దేశ సరిహద్దుల్లో రక్షణగా నిలుస్తున్న సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ ట్రైలర్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే ఏక్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇదే అంశంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నగరానికి చెందిన విశాల్‌కుమార్‌ అనే యువకుడు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫామ్‌ను అపహాస్యం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్ పేజీలో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారని చెప్పారు.