అంఫాన్‌ తుపానుపై మమతకు అమిత్ షా భరోసా 

అంఫాన్‌ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఉదయం ఫోన్‌ చేసి భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులపై మమతతో అమిత్‌ షా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అంఫాన్‌ తుపాను అధిక ప్రభావం చూపనుందని, ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బెంగాల్‌ను తప్పకుండా ఆదుకుంటామని హోంమంత్రి హామీనిచ్చారు.  ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను బెంగాల్‌కు పంపినట్లు అమిత్‌ షా తెలిపారు. 

రాష్ట్రం ఎలాంటి సాయం కోరినా సహాయం చేస్తామని తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు మొత్తం 37 ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను కేంద్రం పంపింది. ఇందులో 20 బృందాలు రంగంలోకి దిగాయని, మిగతా 17 బృందాలు పరిస్థితులను బట్టి సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది ఉండనున్నారు. 

ఈ బృందాలను ఒడిశాలో తుపాను ప్రభావం ఉండే ఎనిమిది జిల్లాలు, బెంగాల్‌లోని ఆరు జిల్లాలకు పంపించారు. పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను పెను తుపానుగా కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా తుపాను ప్రయాణిస్తుంది. రేపు మధ్యాహ్నం బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ తీరం హతియా దీవుల వద్ద తీరం దాటే సూచన ఉంది. 

అత్యంత తీవ్ర తుపానుగా మారి తీరం దాటే సూచన ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 165 -195 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.