కరోనా బాధితుల ఇళ్ళు తప్ప తెలంగాణ అంతా గ్రీన్ జోన్ 

తెలంగాణలో దాదాపుగా లాక్ డౌన్ ను పూర్తిగా సడలించారు. కరోనా బాధితుల 1452 కుటుంబాలు ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్ లు మాత్రమే హాట్ స్పాట్ లు లేదా కంటైన్మెంట్ లు గా ఉంటాయి. మిగతా రాష్ట్రం మొత్తం గ్రీన్ జోన్ పరిధి గా  గుర్తించారు. దానితో సాధారణ వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాలు అన్ని జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన్నట్లు అయింది. 

అయితే రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని తెలిపారు. కాగా, కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పలు కార్యకలాపాలకు అనుమతివ్వాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. సెలూన్లు సహా అన్ని దుకాణాలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పూర్తి అనుమతినిస్తున్నట్టు వెల్లడించారు. 

హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నడుస్తాయని పేర్కొన్నారు. కానీ, హైదరాబాద్ సిటీ బస్సులు  నడవవు, సిటీ లో ఆటో, క్యాబ్ లు నడుస్తాయి. జిల్లాల నుండి వచ్చే బస్సులు సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్సు స్టేషన్ కు చేరుకుంటాయి. 

హైదరాబాద్‌ నగరం తప్ప.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సెలూన్లు సహా అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చు. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో సరి బేసి విధానం ఉంది. ఇప్పటినుంచి సగం సగం ఉండదు. అందరు వారివారి వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నగరంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయంచేసి ప్రకటిస్తారు. కంటైన్మెంట్‌ ఏరియాలో మాత్రం ఏదీ తెరువడానికి అనుమతించరని సీఎం ప్రకటించారు. 

మాస్క్‌ పెట్టుకోవడం అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాలి. ధరించనివారికి వెయ్యిరూపాయల ఫైన్‌ ఉంటుంది. భౌతికదూరం సైతం పాటించాలి. ఎవరికి వారే నియంత్రణ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఆపాలన్నది కాకుండా వ్యక్తిగతంగా శానిటైజేషన్‌ చేసుకోవాలని సీఎం సూచించారు. దుకాణాల యజమానులు సైతం ప్రతి దుకాణం దగ్గర శానిటైజర్లు పెట్టాలని చెప్పారు.