కరొనపై దర్యాప్తుకు చైనా ఒప్పుకోలు.... కానీ మెలిక 

ప్రపంచ దేశాల నుండి వస్తున్న వత్తిడులకు తలొగ్గి కరోనా మూలాలపై దర్యాప్తుకు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ఆమోదం తెలిపారు. 

జెనీవాలో ప్రారంభమైన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాలు మహమ్మారి సమస్యను ఎదుర్కొంటున్నందున. సమస్యపై పట్టుసాధించిన తర్వాతనే ఈ కార్యక్రమాలను చేపట్టడం అందరికీ శ్రేయస్కరమని అంటూ మెలిక పెట్టారు. 

కాగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన ఈవ్యాధి తొలుత బయటపడిన సమయంలో చైనా ప్రభుత్వం బహిరంగత, పారదర్శకతతో బాధ్యతతో వ్యవహరించిందని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే కొవిడ్‌-19పై దర్యాప్తు చేపట్టేందుకు ముందుకురావాలని యురోపియన్‌ యూనియన్‌ రూపొందించిన తీర్మానం తర్వాత ప్రారంభ సమావేశంలో ప్రసంగించాలని జిన్‌పింగ్‌కు సూచించారు.

దాంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన జిన్‌పింగ్‌కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు జరిపేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే, ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై పట్టుసాధించిన తర్వాత విచారణ చేపడదామని సూచించారు. ఈ కీలక సమయంలో డబ్ల్యూహెచ్‌వోకు మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయ సహకారం అందించడం, ప్రజల ప్రాణాలను రక్షించే యుద్ధానికి మద్దతు ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు. 

 ప్రపంచ తక్షణ కర్తవ్యం ప్రజలను రక్షించడమే అని చెప్పారు.  కరోనా వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు చేపట్టేందుకు 120 దేశాలు పట్టుబడుతున్నాయని, ఫార్మల్‌గా అనుమతి పొంది విచారణ చేపడితే బాగుంటుందని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఓ అధికారి చెప్పారు.

కాగా, కొవిడ్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రెండు బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.