కరొనపై దర్యాప్తు కోరిన భారత్ తో సహా 120 దేశాలు 

జెనీవాలో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రారంభం కావడానికి ముందుగా కరోనా వైరస్ మూలాన్ని, వ్యాప్తి జరిగిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరుతూ ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్ లు ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ తో సహా 120 దేశాల మేరకు మద్దతు తెలిపాయి. 

ఈ వైరస్ వ్యాప్తి అయ్యేటట్లు చైనా చేసిన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ఆరోపించడం తెలిసిందే.  మొదట ఈ వైరస్ వచ్చినప్పుడు కప్పిపుచ్చి, అంతా వ్యాప్తి జరిగేట్లు చేసిన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానానికి ఇంకా అమెరికా మద్దతు తెలుపవలసి ఉంది. 

ఈ వైరస్ ఏ విధంగా ప్రారంభమైనదో అన్న విషయమై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మొదటగా ఆస్ట్రేలియా కోరడంతో చైనా ఆగ్రహం ఆపుకోలేకపోయింది. ఆ దేశంపై రాజకీయ దాడికి దిగింది. అయితే 3 లక్షల మంది చని పోవడానికి కారణమైన దీనిపై దర్యాప్తుకు మరిన్ని దేశాలు కూడా తమ స్వరాన్ని జత చేస్తున్నాయి. ఈ డిమాండ్ కు ఆస్ట్రేలియా ప్రధాని మొర్రిసన్ ఐరోపా యూనియన్ మద్దతు కూడగట్ట గలిగారు. 

నిస్పక్షపాతమైన స్వతంత్ర, సమగ్ర విశ్లేషణతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో కరోనాకు చికిత్స జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. సోమవారం నాటికి ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీ, రష్యా, దక్షిణ ఆఫ్రికా, ఇంగ్లాండ్, భారత్ లతో పాటు 120 దేశాలు ఈ డిమాండ్ కు మద్దతు తెలిపాయి. 

అయితే ఈ తీర్మానంలో ప్రత్యేకంగా ఈ వైరస్ ప్రారంభమైన్నట్లు చెబుతున్న  చైనా పేరును గాని, వుహాన్ నగరం పేరును గాని ప్రస్తావించక పోవడం గమనార్హం. 

కానీ శాస్త్రీయ, సహకార క్షేత్రస్థాయి లక్ష్యాల కోసం, వైరస్ మూలాన్ని, మనుష్యులకు వ్యాప్తి చేసిన విధానాన్ని కనుగొనడం కోసం ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థ తో కలసి ప్రపంచం ఆరోగ్య సంస్థ పనిచేయాలని ఈ తీర్మానం కోరుతున్నది.