ఏపీలో కోయంబేడు మార్కెట్‌ ప్రకంపనాలు 

మొన్నటి వరకూ మర్కజ్‌ కేసులు ఆంధ్రా, తమిళనాడును వణికిస్తే, తాజాగా కోయంబేడు మార్కెట్‌ కేంద్రంగా నమోదవుతున్న కేసులు రెండు తెలుగు రాష్ట్రాలకూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎపిలోని పలు జిల్లాల్లో కేసులకు కోయంబేడుతో సంబంధాలు బయటపడుతున్నాయి. 

ఇటీవల వరకూ చెన్నరుకే పరిమితమైన కోయంబేడు ప్రభావం, గత 11 రోజులుగా ఆంధ్రాలోనూ చూపుతోంది. వారం రోజుల క్రితం వరకూ పట్టణాలకే ఎక్కువగా పరిమితమైన కరోనా వైరస్‌ కోయంబేడు లావాదేవీలతో గ్రామాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.

తమిళనాడులో మొత్తం 10,108 కేసులు ఉండగా, చెన్నరులో 5,947 ఉన్నాయి. వీటిలో దాదాపు మూడు వేలకుపైగా కోయంబేడు మార్కెట్‌ ద్వారా వచ్చినవే. ఒక ఐపిఎస్‌ స్థాయి అధికారితో పాటు 250 మంది వరకు పోలీసులకు అక్కడి నుండి వైరస్‌ సోకింది. 

ఈ నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి కోయంబేడు వెళ్లి వచ్చిన వందలాది మంది రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఇప్పటివరకూ 263 కేసులకు కోయంబేడు మూలాలున్నాయని తెలుస్తున్నది. 

ఒక్క చిత్తూరు జిల్లాలోనే 16 మండలాల్లో 92 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కరోనా బాధితుల్లో మొత్తం 19 మందికి కోయంబేడుతో సంబంధాలు ఉన్నాయి.

ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన కోయంబేడు మార్కెట్లో 3,800 షాపులు ఉన్నాయి. 65 ఎకరాల్లో మార్కెట్‌ విస్తరించి ఉంది. పూలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల క్రయవిక్రయాలు నిత్యం జరుగుతుంటాయి. 

పదివేల మంది ఈ మార్కెట్లో పని చేస్తున్నారు. ప్రతిరోజూ లక్షపైనే వ్యాపారులు, రైతులు వచ్చి వెళుతుంటారు. రద్దీ రోజుల్లో రెండు లక్షలపైనే వస్తారు. గత ఏప్రిల్‌ 14న తమిళ ఉగాది రోజు భారీగా జనం తరలి వచ్చారు. దీంతో, తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్‌ తెరిచే వేళలను కుదించింది. 

రద్దీ ఎక్కువై భౌతిక దూరం పాటించలేని పరిస్థితి నెలకొనడంతో అమ్మకందారులకు కరోనా వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడింది. 

మే 5 నుంచి మార్కెట్‌ను మూసేసింది. అక్కడ అమ్మకందారులు, కార్మికులతో కాంటాక్టు ఉన్న వారు 16 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఖ్య సెకండరీ కారకాలతో కలిపి లక్ష దాటి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం నుంచి తమ పంటలను అమ్ముకోవడానికి నిత్యం ఈ మార్కెట్‌కు వెళ్లి వస్తుంటారు. 

అలా వెళ్లిన వారిలో చిత్తూరులో 535 మంది, నెల్లూరు 275, అనంతపురం 310, తూర్పుగోదావరి 65, ప్రకాశం 150, గుంటూరులో 80 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం, కడప, కర్నూలులోనూ కోయంబేడు రిటర్న్స్‌ ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. దాదాపు ఈ సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంటుందని అంచనా.