పాక్ లో అబ్బాయిలతో మాట్లాడితే చంపేయడమేనా! 

పాకిస్థాన్ ఇంకా ఆధునిక సమాజంకు దూరంగా ఉందా? పలు ప్రాంతాలలో నాగరిక పాలన లేకుండా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతున్నదా? అవుననే అనిపిస్తున్నది. ఈ మధ్యనే ఆ దేశంలో ఇద్దరు అమ్మాయిలు పరువు హత్యలకు గురికావడం ఆ సమాజంలో మహిళలకు ఉన్న స్థానాన్ని వెల్లడి చేస్తున్నది. 

కొద్దిరోజుల క్రితం ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో ఇద్దరు అమ్మాయిలను హత్య చేసారు. అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16, 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను వారి బంధువు చంపాడు. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో పురుషులతో స్త్రీలు కలవడం నిషేధించడమే అందుకు కారణం. 

ఖైబర్‌-పఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌ జిల్లాలోని షామ్‌ ప్లెయిన్‌ గారియోమ్‌ గ్రామంలో మే 14 న ఈ హత్యలు జరిగాయని ఓ అధికారి తెలిపారు. హత్యలకు కారణం 52 సెకన్ల వీడియోలో ఒక యువకుడు ముగ్గురు బాలికలతో మాట్లాడుతున్నట్లు కనపడగా, ఆ వీడియోలోని ఇద్దరు బాలికలు చంపగా,  మూడవ అమ్మాయి ఆచూకీ తెలియదని అక్కడ అధికారులు తెలిపారు. 

మూడవ అమ్మాయి బతికే ఉందని చెప్పినప్పటికీ, ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసు అధికారి తెలిపారు. అయితే ఆ వీడియోలో ఉన్న యువకునికి కూడా ప్రాణ హాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. 

ఆ ప్రాంతంలో అంతగా పోలీసుల ప్రాభల్యం లేకపోవడం వల్ల గ్రామాల్లో పెద్దలు చెప్పిందే చట్టంగా నడుస్తుంది. దీంతో ఇటువంటి ఘటనలు ఎక్కువగా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి.