కేంద్రంపై చంద్రబాబు అసత్య ప్రచారం : జివిఎల్

రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు ఆరోపించారు. తమ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేం‍ద్రంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాను పదవిలో ఉన్నప్పుడు సాధించిన అంశాల గురించి వివరిస్తూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ రాసిన లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప దెబ్బలాంటిదని ఎద్దేవా చేసారు.

2016-17లో ఆంధ్రప్రదేశ్‌కు రూ 9700 కోట్లు మంజూరు చేసిన కేంద్రం 2017-18లో రూ 17, 500 కోట్లు విడుదల చేసిందని జీవిఎల్‌ తెలిపారు. అదే విధంగా ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో రూ 10, 372 కోట్లు నిధులు కేటాయించారని చెప్పారు. ఇవన్నీ బీజేపీతో టీడీపీ నుంచి విడిపోయాక విడుదలైన నిధులేనని అంటూ అయినప్పటికీ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ అసత్య ప్రచారం చేస్తూ టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం నిజంగా అలా వ్యవహరించినట్లైతే రాష్ట్రానికి ఇన్ని నిధులు వచ్చేవా అని జీవీఎల్‌ ప్రశ్నించారు. కేంద్ర నిధుల విడుదలపై వివరాలు కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశానన్న జీవీఎల్‌ వెనుకబడిన జిల్లాల విషయంలో రూ 350 కోట్లపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. యూసీలు ఇచ్చామని చెప్తున్నారని, వాటితో పాటు యుటిలైజేషన్ ఎక్స్ పెండిచర్ స్టేట్‌మెంట్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలా చేయకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు చెప్పారు.