ప్రాంతీయ విద్వేషాలకు కేసీఆర్‌, జగన్‌ కుట్ర  

 తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుట్ర పన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విషయంలో జగన్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తగ్గించుకున్నారని ధ్వజమెత్తారు. 

‘‘బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం, తెలంగాణ వాటా 535 టీఎంసీలు ఉంటే 299 టీఎంసీలే వినియోగించుకునేందుకు ఎందుకు సమ్మతించారు? టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేయడం రహస్య ఒప్పందంలో భాగం కాదా?" అంటూ సంజయ్ ప్రశ్నించారు.  పోతిరెడ్డిపాడు సామర్థ్యం 80వేల క్యూసెక్కులకు పెంచుతూ ఏపీ కేబినెట్‌ గత జనవరిలోనే నిర్ణయం తీసుకున్నా, అప్పుడు ఎందుకు సుప్రీంకు వెళ్లలేదు? అని నిలదీశారు. 

గత ఫిబ్రవరిలో ప్రగతి భవన్‌లో జగన్‌తో మీరు జరిపిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును నిరసిస్తూ తాను రాసిన లేఖపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తక్షణం స్పందించి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు ఆదేశించడం తెలంగాణ ప్రజల విజయమని సంజయ్‌ పేర్కొన్నారు. 

కాగా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో సీఎం కేసీఆర్‌ అసమర్థతను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారని సంజయ్‌ తెలిపారు.