జగన్ రైతు భరోసా యాడ్ లో మోదీ బొమ్మలేదే!

కేంద్రం ఇస్తున్న నిధులతో పధకాలు అమలు జరుపుతూ, వాటిని తమవిగా ప్రచారం చేసుకొంటున్నాయని రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి నేతలు తరచుగా విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా పధకం విషయంలో ఆ విధంగా వ్యవహరించడం బిజెపి నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నది. 

అధికారంలోకి వస్తే రైతులకు ప్రతి ఏటా రూ  12,500 ఆర్ధిక సహాయం చేస్తామని అంటూ వైసిపి నేతలు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పధకం ప్రకటించి, ఒకొక్క రైతులు రూ 6,000 ఇస్తున్నట్లు ప్రకటించింది. దానితో ఆ మొత్తాన్ని తాము ప్రకటించిన రైతు భరోసా పధకంలో జతచేసి, మిగిలిన మొత్తాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. 

వైసిపి ప్రభుత్వం రైతు భరోసా పధకం ప్రకటించేసరికి పీఎం కిసాన్ పథకమే లేకపోవడం గమనార్హం. ఇలా ఉండగా, శుక్రవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ స్కీమ్ కింద మరో విడత రైతుల ఖాతాల్లోకి రూ 2,800 కోట్లను జమ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ 5,500 వేశారు. అయితే  ఓ వైపు పీఎం కిసాన్ నిధులను వాడుకుంటూ అదంతా తమ ఘనతగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగిస్తుంది. 

శుక్రవారం పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేశారు. జగన్ ప్రభుత్వంపు యాడ్ లలో సంబంధింత మంత్రుల ఫోటోలు ప్రచురించే అలవాటు లేదనుకొంది. కనీసం కేంద్ర నిధులు వాడుకొంటూ ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం పట్ల ఏపీ బిజెపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.