తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ పై బిజెపి ఫైర్ 

తెలంగాణ శాసనమండలి కమిటీ హాల్ లో  మీడియా సమావేశం హించి  ప్రతిపక్ష పార్టీల పైన,  ప్రధానంగా  బిజెపి పైన  తెలంగాణ  శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేయడాన్ని బిజెపి తీవ్రంగా ఖండించింది. 

శాసన మండలి చైర్మన్ పైన, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ పైన ప్రజలు కానీ, నాయకులు కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే గౌరవిస్తున్నామని బిజెపి ఎమ్యెల్సీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు.

అయితే  పార్టీ ద్వారా వచ్చే వ్యక్తులు ఆ పదవిలో కూర్చున్న తర్వాత రాజకీయాలు మాట్లాడడం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల పైన ఆరోపణలు దూషణలు చేయడం గౌరవ ప్రద స్థానంలో ఉన్న వ్యక్తులకు సరైంది కాదని స్పష్టం చేశారు. 

పార్టీ వ్యక్తులుగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ పదవులకు దూరంగా ఉండి మాట్లాడితే సముచితంగా ఉంటుందని హితవు చెప్పారు. తెలంగాణ ప్రాంతవాసి గా చైర్మన్ హోదాలో  గుత్తా సుఖేందర్ రెడ్డి అన్యాయం జరుగుతున్న దానిని ఖండించడం, పోరాటం చేయడం సముచితమే టుబా రాజకీయాల మాట్లాడి దుష్ప్రచారం చేయడం రాజ్యాంగ హోదా లో ఉన్న వ్యక్తికి సరైంది కాదని రావు ధ్వజమెత్తారు. 

చైర్మన్ గారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు ఉండగా  ఒక్క చుక్క అదనంగా తీసుకుపోయే ప్రసక్తి ఉండదని మాట్లాడి నటువంటి వ్యక్తి అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో 30 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు చెబుతున్నారని మాట్లాడడం గమనిస్తే ఆయనలో స్పష్టత లేనట్లు వెల్లడి అవుతుందని విమర్శించారు. 

అధికారులు చెబుతున్నది కారెక్టా? లేక చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి కెసిఆర్ పైన ఉన్న గుడ్డి నమ్మకం కారెక్టా ? వాస్తవాలు ఏమిటో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని రావు డిమాండ్ చేశారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం తో పాటు అనేక పార్టీలలో పనిచేసిన అనుభవం ఉన్న చైర్మన్ గారు బిజెపి పైన, ఆ పార్టీ నాయకుల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.