చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ ఆరేళ్ళ పాలన 

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ శనివారంతో విజయవంతంగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని ఎన్డీయే అసాధారణ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలను మే 16న ప్రకటించారు. 

ఈ ఆరేళ్ళ కాలంలో ఒక విధంగా మోదీ పాలన చరిత్ర సృష్టించింది. నోట్ల రద్దు, జీఎస్టీ, పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు, జమ్మూ కాశ్మీర్ ను ప్రధాన స్రవంతిలో కలపడం, మొదటిసారి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేయడం వంటి పలు అసాధ్యాలను సాధ్యం చేశారు. 

మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ సంపూర్ణ ఆధిక్యత సాధించింది. నరేంద్ర మోదీ హవాకు కొనసాగింపుగా 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్డీయే తిరిగి అధికారం నిలబెట్టుకుంది. ట్విట్టర్‌ ద్వారా బీజేపీ ఆరేళ్ల విజయోత్సవాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది.

మోదీ పటిష్ట నాయకత్వం, ఆరేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలను ఈ వీడియోలో బీజేపీ హైలైట్ చేసింది. తొలి ఐదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ నుంచి గ్రామాల విద్యుద్దీకరణ, బేటీ పడావో బేటీ బచావో ప్రోగ్రాం, జన్‌థన్ యోచన నుంచి చారిత్రక అయోధ్య తీర్పు, రెండో దఫా ఐదేళ్ల పాలన ప్రారంభంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు వంటి అంశాలు ఇందులో ప్రస్తావించారు. 

తొమ్మిది నిమిషాల నిడివి గల ఈ వీడియోలో  ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల ప్రస్తావన జరిగింది. ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందంటూ ఆయనపై దేశ ప్రజలు పలువురు విశ్వాసం చాటుకున్న అంశాలూ వీడియోలో చోటుచేసుకున్నాయి.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 544 స్థానాలకు గాను 282 స్థానాలు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇది 15వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన దాని కంటే 166 సీట్లు ఎక్కువ. 2014 మే 26న మోదీ ప్రమాణస్వీకారం చేశారు. 2019లోనూ బీజేపీ 303 సీట్లతో భారీ విజయం దక్కించుకుంది.  ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో వరుసగా రెండోసారి గెలుపొందడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.