పశ్చిమ బెంగాల్ లో మూడు రధయాత్రలు జరుపనున్న బిజెపి

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రాబల్యాన్ని కట్టడి చేయడం కోసం బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాలను కుడా చుట్టుముట్టే విధంగా మూడు రధయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ యాత్రలను డిసెంబర్ లో జరిపినా వాటికి సంనహంగా ప్రచారాన్ని మాత్రం దుర్గాపూజ పూర్తి కాగానే ప్రారంభిస్తామని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు.

మొదటి యాత్రను డిసెంబర్ 3న బీర్భుం జిల్లాలోని తరాపిత్ నుండి పార్టీ అద్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ యాత్రలలో కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ పార్టీ నేతలు పాల్గొంటారు. రెండవ రధయాత్రను డిసెంబర్ 7న దక్షిణ  24 పరగణాల జిల్లాలోని నమఖన-గంగాసాగర్ నుండి, మూడో యాత్ర ఆ మరుసటి రోజున కోచ్ బేహార్ నుండి ప్రారంభిస్తారు.

ఒకొక్క యాత్ర 14 లోక్ సభ నియోజకవర్గాలలో జరుగుతుంది. జనవరి చివరకు ఈ యాత్రల ముగింపు సందర్భంగా కోలకతాలో భారీ బహిరంగ సభ జరపాలని అనుకొంటున్నారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. గత జూన్ లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అమిత్ షా పర్యటించిన సందర్భంగా ఈ యాత్రల గురించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సగంకు పైగా, 22 లోక్ సభ సీట్లు గెలుపొందాలని అమిత్ షా లక్ష్యంగా నిర్ణయించారు. గత ఎన్నికలలో పార్టీ రెండు సీట్లను మాత్రమె గెలుపొందింది.

ఈ యాత్రల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, ర్యాలీలు, సోషల్  మీడియాలో విస్తృతంగా ప్రచారం చేబడతారు. రాష్ట్ర ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ పాలనతో విసుగు చెంది ఉండడంతో బిజెపి బలోపేతం కావడానికి బెంగాల్ లో విశేషంగా ఉన్నట్లు పార్టీ నాయకత్వం భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి గెలుపొందగల అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు 26 నుండి 28 వరకు ఉన్నట్లు గుర్తించారు.