భారత్ కు ఆపిల్ రాకుండా అడ్డుకొంటున్న ట్రంప్!

ఒక వంక భారత్ తో స్నేహం హస్తం చాస్తూనే, చైనా పట్ల విద్వేషం విరజుమ్ముతూనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా నుండి భారత్ కు రావాలని చూస్తున్న అమెరికా కంపెనీల పట్ల ద్వంద వైఖరి అవలంభిస్తున్నారు.  అమెరికా కంపెనీలు తిరిగి స్వదేశానికే రావాలని, లేనిపక్షంలో కొత్తకొత్త పన్నులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ హెచ్చరించారు. 

దానితో చైనా నుండి భారత్ కు వచ్చేందుకు సిద్ధపడ్డ యాపిల్‌ ను అడ్డుకొంటున్నట్లు అయింది. అమెరికా టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ చైనా నుంచి భారత్‌, ఐర్లాండ్‌కు తమ ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చూస్తున్న సంగతి విదితమే. 

కాగా,  ఫాక్స్‌ బిజినెస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘భారత్ కు వెళ్తామని యాపిల్‌ చెప్తున్నది. ఇదే జరిగితే ఆ సంస్థకు పన్ను పోటు తప్పదు’ అంటూ హెచ్చరించారు. అమెరికాకు కాకుండా చైనా నుంచి మరే దేశానికి తమ ప్లాంట్లను తరలించినా వాటికి కొత్త పన్ను విధానం ఉంటుందని తేల్చిచెప్పారు. 

అలాగే అమెరికాకు వచ్చే సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయనీ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికా సంస్థలు స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని, అమెరికన్‌ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. అలాకాకుండా వేరే దేశాలకు వెళ్తామంటే ఊరుకోబోని ఆయన తేల్చి చెప్పారు. 

చైనా నుంచి బయటకు వస్తున్న విదేశీ సంస్థలను ఆకట్టుకోవాలన్న భారత్‌ ఆశల్ని ఈ ప్రకటన ఆదిలోనే తుంపివేసిన్నట్లు అయ్యే అవకాశం ఉంది. నిజానికి కరోనా వైరస్‌ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాకు భారత్‌ అండగా నిలిచింది. ఈ మహమ్మారి నియంత్రణకు వినియోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధాన్ని సరఫరా చేసింది. తనకు నష్టం వస్తుందనిపిస్తే చైనా, భారత్‌ అన్న తేడాలుండవని, అంతా ప్రత్యర్థులేనని అహంకారాన్ని ట్రంప్ ప్రదర్శిస్తున్నారు.

మరోవంక, తమ దేశం నుంచి భారత్‌, ఇతర సరిహద్దు దేశాలకు వెళ్తున్న సంస్థలను అడ్డుకునేందుకు చైనా కుట్రలకు తెరతీసింది. దేశ సరిహద్దుల్లో సైన్యం ద్వారా దాడులు, దురాక్రమణలకు తెగబడుతున్నది. లడఖ్‌, సిక్కిం సరిహద్దుల్లో గత మూడు వారాల నుంచి నెలకొన్న ఉద్రిక్తతలు ఇందుకు నిదర్శనంగా  పలువురు భావిస్తున్నారు. 

నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, తైవాన్‌, మలేషియా దేశాల సరిహద్దుల్లోనూ డ్రాగన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.  పొరుగు దేశాల్లో అలజడులు చెలరేగితే తమ దేశం నుంచి ఏ సంస్థా వెళ్లదన్న దురాలోచనతో చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నది.