వర్షాలు పడుతున్నా ఇంకా 14 శాతం లోటు

గత మూడు రోజులుగా వర్షాలు బాగా పడుతున్నా ఇంకా రాష్ట్రంలో 14 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నీరు-ప్రగతి,వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎనిమిది జిల్లాలలో వర్షపాతం లోటు ఉందని చెప్పారు. ప్రతిఏటా జులైలో వర్షాలు తగ్గడం, ఆగస్టులో మళ్లీ పెరగడం చూస్తున్నామని అంటూ ప్రజలకు నీటి భద్రత ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. ఉపరితల జలాలు,భూగర్భజలాలు సద్వినియోగం చేసుకోవాలని అంటూ సమర్ధ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలని సూచించారు.

రిజర్వాయర్లకు 40% నీటి చేరిక ఉందని, శ్రీశైలంకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని అంటూ ఇంకా నాగార్జున సాగర్,శ్రీశైలం జలాశయాలకు 210టిఎంసిలు చేరవలసి ఉన్నదని పేర్కొన్నారు. చిన్ననీటిపారుదలలో 204టిఎంసిలకు గాను 23%మాత్రమే నీరు చేరినట్లు తెలిపారు. వంశధార ఫేజ్ 2,స్టేజి 2 పనులు వేగంగా జరుగుతున్నాయని అంటూ హీరమండలం రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేశారని చెప్పారు.

వంశధార వరదజలాలు 4వేల క్యూసెక్కులు సైడ్ వేయర్ ద్వారా హీరమండలం రిజర్వాయర్ కు చేరుతున్నాయని తెలిపారు. ఇచ్ఛాపురం వరకు నీళ్లు తీసుకెళ్లాడం ద్వారా శ్రీకాకుళంలో వలసలు లేకుండా చేయాలని సూచించారు. వ్యవసాయం పురోగతితో వలసలు అదృశ్యం కాగలవని అంటూ సముద్రంలోకి పోయే నీటిని తగ్గించగలిగామని పేర్కొన్నారు.