పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించండి

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పొగాకు ఉత్పత్తుల అమ్మకం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై నిషేధం విధించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ మంత్రి హర్షవర్ధన్‌ విజ్ఞప్తి చేశారు.

కోవిడ్‌-19ను అదుపు చేసేందుకు ఇప్పటికే రాజస్తాన్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాలు ఇటువంటి ఉత్తర్వులను జారీ చేశాయి. పొగరాని పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం ద్వారా కోవిడ్‌-19, సైన్‌ఫ్లూ వంటి అంటువ్యాధులను వ్యాప్తింప జేసి ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రులకు రాసిన లేఖలో హెచ్చరించారు. 

ఇటువంటి పొగాకును వినియోగించడం వల్ల రోగాల వ్యాప్తికి కారణమయ్యే అపరిశుభ్రమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తారని, అదేవిధంగా ఇటువంటి అమ్మకాలు జరిగే షాపుల వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడం ద్వారా కోవిడ్‌-19 వ్యాప్తికి కారణమౌతారని పేర్కొన్నారు. 

మే 11న రాసిన లేఖలో పొగాకు ఉత్పత్తుల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యానికి ముప్పు అని పేర్కొన్నారు. పొగరాని పొగాకు ఉత్పత్తులను నమలవద్దని, ఉమ్మవద్దని భారత వైద్య పరిశోధన మండలి  (ఐసిఎంఆర్‌) కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.