మోదీ, నిర్మలాల‌కు అమిత్‌ షా అభినందనలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అభినందనలు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్‌ విడతలవారీగా ప్రకటిస్తున్నారు. 

మొదటి రోజు చిన్న పరిశ్రమలు, మధ్య తరగతికి, రెండో రోజు వలస కార్మికులు, రైతులకు నేడు మూడవ రోజు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీపై అమిత్‌ షా స్పందించారు. 

రైతుల సంక్షేమంలోనే భారతదేశ సంక్షేమం ఉందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తుందని పేర్కొన్నారు. నేడు రైతులకు అందించిన అపూర్వ సహాయం మోదీ ముందు చూపును తెలుపుతుందని కొనియాడారు. 

రైతులను బలోపేతం చేయడం ద్వారా దేశం స్వయం సంవృద్ధి సాధించేందుకు బాటలు వేసిందని అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాను అభినందనలు తెలుపుతున్నట్లు అమిత్‌ షా పేర్కొన్నారు.

కాగా, రైతుల ఉత్పత్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తేవాలని నిర్ణయించడం ముదావహమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న  సంస్కరణలతో రైతులకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల అమ్మకానికి నిబంధనల సడలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

వ్యవసాయరంగ మౌలిక వసతులు, మత్స్య, పశుసంవర్ధక రంగాల బలోపేతానికి తీసుకున్న చర్యలు ఈ రంగానికి కొత్త శక్తిని ఇస్తాయని భరోసా వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాలు ఇటు ఉత్పత్తిదారులతో పాటు అటు వినియోగదారులకు కూడా మేలు చేస్తాయని పేర్కొన్నారు.