చైనాలో 6.4 లక్షల మందికి వైరస్, 4 లక్షల మరణాలు!

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ను వ్యాపింప చేసిన చైనా తాము దీనిని విజయవంతంగా కట్టడి చేశామని, ఎక్కడో సుదూరంగా ఉన్న ఐరోపా, అమెరికా దేశాలకు వ్యాపించి మహా ప్రళయం సృష్టించినా తమ దేశంలో మాత్రం ఎక్కువ ప్రాంతాలకు వ్య్యాపింపకుండా నిరోధించామని గొప్పగా చెప్పుకొంటున్నది. 

అయితే నిరంకుశ పాలనలో ఉన్న చైనాలో వాస్తవంగా ఏమి జరుగుతుందో ఆ ప్రభుత్వం బైటకు తెలియనీయదు. మావో హయాంలో 1957 - 1961ల మధ్య 3.7 కోట్ల మంది ప్రజలు ఆకలితో చనిపోతే 20 ఏళ్ళ తర్వాత గాని బయటపడలేదు. ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ ఎటువంటి భీభత్సాహం సృష్టించిందో కొంత కాలం తర్వాత గాని వెల్లడయ్యే అవకాశం లేదు. 

ప్రస్తుతం చైనా చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం 83,000 మందికి ఈ వైరస్ సోకగా 4633 మంది మాత్రమే చనిపోయారు. 78,200 మందికి పైగా ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఆ దేశం నుండే లీక్ అయిన ఒక పత్రం ప్రకారం 6.4 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకగా, 4 లక్షల మందికి పైగా మృతి చెందిన్నట్లు తెలుస్తున్నది. 

డేటాసెట్ అనే వెబ్ సైట్ ద్వారా లీక్ అయిన ఈ అంకెలు కేవలం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు - మూడు నెలలకు సంబంధించినవే కావడం గమనార్హం. మొత్తం 230 నగరాలలో ఈ వైరస్ వ్యాప్తి చెందిన్నట్లు వెల్లడించింది. అందుకు ఆధారంగా అధికారులు సందర్శించిన ప్రదేశాల జిపిఎస్ కోడ్ లను కూడా సేకరించారు. 

వైరస్ సోకిన ప్రాంతాలకు సంబంధించిన అన్ని ఆసుపత్రులు, అపార్టుమెంట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, రెస్టారెంట్లు, పాఠశాలల వివరాలు కూడా సమకూర్చారు. ఈ గణాంకాలను చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి సేకరించామని తెలిపిన వెబ్ సైట్ భద్రతా కారణాలరీత్యా ఎవ్వరి ద్వారా లీక్ అయిందో మాత్రం వెల్లడించలేదు. కొన్ని యూనివర్సిటీలు ప్రచురించిన డాటా ట్రాకర్లతో ఈ అంకెలు పోలి ఉండడం గమనార్హం. 

ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడగా, అమెరికాలో 14 లక్షల మందికి పైగా సోకగా 86,000 మంది మృతి చెందారు. స్పెయిన్, బ్రిటన్, ఇటలీ లలో ఒకొక్క దేశంలో 25,000 మందికి పైగా మృతి చెందారు. ఈ ప్రాణాంతక వైరస్ మొత్తం ప్రపంచంలో పేదరికం, ఆకలి పరిస్థితులను తీవ్రతరం కావిస్తుండగా, దేనికి మూలకారణమైన చైనా నుండి మాత్రం వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. 

చైనా చెబుతున్న లెక్కలను మొత్తం ప్రపంచం నమ్మడం లేదు. చైనాలో 2.10 కోట్ల మొబైల్ ఫోన్ లు మూగబోవడం, ఉహాన్ డైలీ వంటి పత్రికలు కొన్ని సంచలన అంశాలను వెల్లడిస్తూ ఉండడంతో చైనా విశ్వసనీయతను ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది. 

ఇతర దేశాలలో వలే కాకుండా టెస్టింగ్ పరికరాలు అందుబాటులోకి రాక ముందు చైనాలో ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించింది. అయితే వాస్తవాలను బైటకు రాకుండా కప్పిపుచ్చడంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆరితీరింది కావడం అందరికి తెలిసిందే.