క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్రంగా గాంధీ ఆస్పత్రి    

కరోనా చికిత్సను దేశంలో తొలుత ప్రారంభించిన ప్రధాన ఆసుపత్రిలలో ఒకటైన హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని  క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్రంగా మార్చి  సరికొత్త ప్రయోగశాలగా తీర్చిదిద్దబోతున్నారు. అన్ని రకాల వ్యాక్సిన్‌, మందుల వినియోగానికి ట్రయల్‌ కేంద్రంగా ఆస్పత్రి ఉండబోతోంది. ఇందు కోసం అవసరమైన సంస్థలతో ఒప్పందం చేసుకునే యోచనలో గాంధీ ఆస్పత్రి వైద్యాధికారులున్నారు. 

సాధారణ వైద్య సేవలు అందించే  గాంధీ ఆస్పత్రి కరోనా వైరస్‌ వ్యాప్తితో పూర్తిగా ‘కొవిడ్‌-19 ఆస్పత్రి’గా మారిపోయింది. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి ప్లాస్మాథెరపీ, వ్యాక్సిన్‌, మందుల క్లినికల్‌ ట్రయల్స్‌కు గాంధీ కీలకం కాబోతోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా మందులు, వ్యాక్సిన్‌పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందు కోసం ఐసీఎంఆర్‌తో ఒప్పందం చేసుకోవడానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు సిద్ధమవుతున్నారు. 

వారం పది రోజుల్లో ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ను కరోనా పాజిటివ్స్‌కు క్లినికల్‌ ట్రయల్‌ బేస్‌గా వినియోగించే యోచనలో ఉన్నారు. ఐసీఎంఆర్‌ అనుమతులు రాగానే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా క్లినికల్‌ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్‌ ఇప్పటికే  అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు దాతల నుంచి ప్లాస్మా సేకరణ మొదలుపెట్టారు. 

ప్లాస్మాను ఇవ్వాలని నిర్ణయించిన రోగుల వివరాలను ఐసీఎంఆర్‌కు గాంధీ ఆస్పత్రి వైద్యులు పంపించారు. అక్కడి నుంచి అనుమతి లభిస్తే వారికి ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో ప్లాస్మా క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తారు. ఆరు నెలల పాటు గాంధీలో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. ఈ ఆరు నెలల్లో మంచి ఫలితాలు వస్తే గాంధీ ఆస్పత్రి వైద్యులే ప్లాస్మాథెరపీ చేస్తారు.

మొబైల్‌ కంటైనర్‌ వైరల్‌ రిసెర్చ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లో కరోనా వ్యాక్సిన్‌ తయారీ, వైరస్‌ నివారణ మందులపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇందులో గాంధీ వైద్యులు కూడా భాగస్వాములు కానున్నట్లు తెలుస్తున్నది. 

1976లో తొలిసారిగా గాంధీ ఆస్పత్రి ఓ వ్యక్తికి మొదటి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసి పునర్జన్మ ఇచ్చిన ఏకైక ఆస్పత్రిగా నిలిచింది. అప్పటి నుంచి గాంధీలో వేలకుపైగా హార్ట్‌ సర్జరీలు నిర్వహించారు. 1976లో ఐసీయూ పీడియాట్రిక్‌, న్యూరాలజీ, 1977లో కార్డియో క్యాథటరైజేషన్‌ ల్యాబొరేటరీ, 1979లో యూరాలజీ, 1985లో గ్యాస్ర్టో ఎంట్రాలజీ, 1989లో ఎండోక్రైనాలజీ, 1991లో కార్డియోథొరాసిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌, నెఫ్రాలజీ ఇలా అనేక విభాగాలను విస్తరించి సూపర్‌స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు.