వేతనంలో 30%కోత విధించుకున్న రాష్ట్రపతి కోవింద్

కరోనాపై ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు ఊతంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తన నెలసరి వేతనంలో 30 శాతం కోతను తనకు తానే తగ్గించుకోవడమే కాక ఖర్చులను కూడా తగ్గించుకునేలా పొదుపు చర్యలు చేపట్టారు. ఈవిధంగా సంవత్సరం పాటు అమలు చేయడానికి సిద్ధమయ్యారని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు తెలిపాయి.

సామాజిక దూరం పాటించేందుకు దేశీయ పర్యటనలు, కార్యక్రమాలను తగ్గించుకున్నారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని కూడా చాలావరకు కనీస స్థాయికి తగ్గించారు. అధికారికంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే సంప్రదాయ వేడుకలు, అలంకరణలు, అతిధులకు విందుల ఖర్చులు బాగా తగ్గుతాయి. రాష్ట్రపతి భవన్‌లో మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు కూడా బాగా తగ్గించుకోవాలని రాష్ట్రపతి భవన్ సిబ్బందికి ఆదేశించారు.

కార్యాలయంలో ఇంధనం, వివిధ రకాల వినియోగం తగ్గుతుంది. ఉదాహరణకు కాగితం ఖర్చు వృధా బాగా తగ్గించుకోడానికి పర్యావరణ హితం పాటించడానికి వీలుగా ఈ టెక్నాలజీ వినియోగిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో వినియోగించే లిమోసిన్ (కారు) కొనుగోలును వాయిదా వేశారు. 

ఇంధనం, విద్యుత్ వినియోగ ఖర్చులను తగ్గించుకోవడంలో, వనరులను పరిమితంగా వినియోగించడంలోను ఆదర్శంగా ఉండేలా చూడాలని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలకు రాష్ట్రపతి ఆదేశించారు. గత నెలలో కూడా పిఎం కేర్స్ ఫండ్‌కు రాష్ట్రపతి తన వేతనాన్ని విరాళంగా అందించారు. ఈ పొదుపు చర్యల వల్ల రాష్ట్రపతి భవన్ బడ్జెట్‌లో 20 శాతం వరకు ఆదా అవుతుందని భావిస్తున్నారు.