మోదీ సర్కార్‌పై ఐఎంఎఫ్‌ ప్రశంసలు

ఒకవంక రూపాయి పతనం, మరోవంక అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలతో భారత ఆర్ధిక వ్యవస్థ క్లిష్టమైన వత్తిడులను ఎడుర్కొంతున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం జరుపుతున్న ఆర్ధిక వ్యవహారాల పనితీరు పట్ల మాత్రం అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. వృద్ది రేట్ మెరుగుగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు చెప్పిన రెండు రోజులకే,  నేతృ‍త్వంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ఐఎంఎఫ్‌ గుర్తిస్తూ ఈ ఏడాది, వచ్చే ఏడాది సైతం భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి  (ఐఎంఎఫ్‌) వ్యాఖ్యానించింది.

ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న ఐఎంఎఫ్‌ వార్షిక భేటీకి ముందు విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) నివేదికలో మోదీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పించింది. ఇటీవల భారత్‌లో జీఎస్టీ, దివాలా చట్టం, విదేశీ పెట్టుబడుల సరళీకరణకు చర్యలు వంటి కీలక సంస్కరణలు చేపట్టడంతో భారత్‌లో వ్యాపారం సులభతరమైందని వ్యాఖ్యానించింది.

పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో వచ్చే ఏడాది భారత ఆర్థిక వృద్ధి రేటును 0.1 శాతం మేర తగ్గించి 7.4 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ స్ధాయి వృద్ధి రేటు సైతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.3 శాతంగా ఐఎంఎఫ్‌ పేర్కొంది.

నోట్ల రద్దు, జీఎస్టీ నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుని భారీ వృద్ధిరేట్ల దిశగా అడుగులు వేస్తోందని డబ్ల్యూఈఓ నివేదిక పేర్కొంది. 2019 తర్వాత భారత్‌ 7.75 శాతం వృద్ధి రేటును నిలకడగా సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

తమ అంచనాలు నిజమైతే భారత్‌ త్వరలోనే తిరిగి ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉందని తెలిపింది. చైనాను 2018లో 0.7శాతం తేడాతో దాటిపోనుందని తెలిపింది. 2019లో మరో 1.2శాతం వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2017లో చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

భారత్‌ కంటే 0.2శాతం ఎక్కువగా 6.9శాతం వృద్ధిరేటు సాధించింది. కాగా ఈ ఏడాది చైనా 6.6శాతం వృద్ధిరేటు మాత్రమే సాధించే అవకాశం ఉందని, 2019లో అది 6.2శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ నివేదికలో పేర్కొంది. అమెరికా చైనాపై విధిస్తున్న సుంకాల ప్రభావమూ ఆ దేశ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.