గ్రామాల‌కు రూ.4200 కోట్లు, రైతుల‌కు 25 వేల కోట్ల రుణాలు

ఆత్మ నిర్భ‌ర భార‌త్ ప్యాకేజీలో రెండో భాగం వల‌స కూలీలు, రైతులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, స్వ‌యం ఉపాధి పొందుతున్న వారు ల‌క్ష్యంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్లడించారు. 

ఇప్ప‌టికే 3 కోట్ల‌ మంది రైతుల‌కు రూ.4.22 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌కు సంబంధించి మూడు నెల‌ల మారిటోరియం విధించిన‌ట్లు గుర్తు చేశారు. త‌మ రుణాల‌ను నిర్ణీత స‌మ‌యంలోనే చెల్లించే రైతుల‌కు ఇచ్చే వ‌డ్డీ రాయితీ వెసులుబాటును మే 31 వ‌ర‌కు పొడిగిస్తున్నామ‌ని చెప్పారు.  

లాక్ డౌన్ కాలంలోనూ కొత్త‌గా 25 ల‌క్ష‌ల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని పేర్కొ‌న్నారు. ఈ కార్డులు వ‌చ్చిన వారికి రూ.25 వేల కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు. అలాగే మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు 63 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.86,600 కోట్ల రుణాలు  మంజూరు చేశామ‌ని తెలిపారు. 

నాబార్డు ద్వారా స‌హ‌కార బ్యాంకులు, రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల‌కు రూ.29,500 కోట్లను రీఫైనాన్స్ చేసిన‌ట్లు చెప్పారు.  గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల కల్ప‌న కోసం మార్చిలో రూ  4200 కోట్లు నిధుల‌ను రాష్ట్రాల‌కు అందించామ‌ని పేర్కొన్నారు. రైతులు పండించిన పంట‌ల‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు మార్చి నుంచి రూ.6700 కోట్ల వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ ప‌రిమితి క‌ల్పించిన‌ట్లు చెప్పారు.

 ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ (ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు) విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నాటికి దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.  ఇక నుంచి రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకోవచ్చు. 

ఈ విధానాన్ని పోర్టెబులిటీ అంటారు. అంటే తెలంగాణకు చెందిన వ్యక్తి ఢిల్లీలో నివాసం ఉంటున్నట్లయితే.. ఢిల్లీలోనే రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఈ విధానం అమలులో ఉంది. ఇది ఇకపై దేశ వ్యాప్తంగా అమలు కానుంది. 

ఈ నూతన విధానం వల్ల 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కగలనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైన 83 శాతం మందికి ఇది ప్రత్యక్షంగా ఉపయోగ పడుతుందని అన్నారు.