తెలంగాణలో వలస కూలీలతో కరోనా ముప్పు 

తెలంగాణలో తొలుత విదేశాల నుంచివచ్చిన వారివల్ల, తర్వాత మర్కజ్‌తో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ కాగా  ఇప్పుడు వలస కూలీల వల్ల ఆ ముప్పు ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కేంద్రం లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు వస్తున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. 

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను హోటళ్లలో క్వారంటైన్‌లో ఉంచుతున్నామని పేర్కొన్నారు. రైళ్ల ద్వారా వచ్చిన వారికి జ్వర పరీక్షలు చేసి చేతిపై హోం క్వారంటైన్‌ ముద్ర వేసి పంపిస్తున్నామని వివరించారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేసి 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. 

ఇప్పటి వరకు విమానాల్లో 798 మంది, రైళ్లలో 239 మంది, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి వచ్చారని ఈటల వివరించారు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా సోకిన మరో గర్భిణికి కాన్పు చేసిన గాంధీ వైద్యులకు మంత్రి అభినందనలు తెలిపారు.

కాగా, రాష్ట్రంలో శిశుమరణాలు గణనీయంగా తగ్గడంపై ఈటల సంతోషం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు మరణాల రేటు 39 ఉండగా, ఇప్పుడు 27కి తగ్గిందన్నారు.