చైనాపై సర్వత్రా  ప్రతీకారేచ్ఛ

గత ఐదు నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై సర్వత్రా ఆగ్రహం  వ్యక్తమవుతున్నది చైనా నిర్లక్ష్యం కారణంగానే మూడు లక్షలకు   చేరువలో   ప్రజలు  ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని పలుదేశాల అధినేతలు మండిపడుతున్నారు.

జన నష్టమే కాకుండా ఆర్థికంగా కూడా తాము దెబ్బతినడానికి కారణమైన చైనాను శిక్షిస్తామంటూ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాలన్నీ చైనాకు గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నాయి.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అది చైనాను వెనకేసుకొచ్చిందని విమర్శిస్తున్నారు. దీనిపై త్వరలో జరుగనున్న ప్రపంచ ఆరోగ్య సదస్సులో చైనాను, డబ్ల్యూహెచ్‌వోను నిలదీసేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ సదస్సులో చైనాకు వ్యతిరేకంగా ఓ తీర్మానం ప్రవేశపెడుతామని యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది. 

కరోనా విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని, దీనిపై దర్యాప్తు జరిపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలువురు ప్రపంచదేశాధినేతలు డిమాండ్‌ చేస్తున్నారు.    కొవిడ్‌-19ను చైనా వైరస్‌ అని ట్రంప్ ఆరోపించారు. వైరస్‌ ఎలా పురుడుపోసుకుందో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

డ్రాగన్‌ నిజాయితీగా వ్యవహరించాలని జర్మనీ చాన్సలర్‌ ఏంజిలా మెర్కెల్‌, చైనాను అంతర్జాతీయ కోర్టులో నిలబెట్టాలని బ్రిటన్‌ రక్షణమంత్రి బెన్‌ వాలెస్‌, స్వీడన్‌ ఆరోగ్య మంత్రి లీనా హాలెన్‌గ్రెన్‌ డిమాండ్‌ చేశారు. గత 20 ఏండ్లల్లో ఐదు రకాల వైరస్‌లు చైనా నుంచే వచ్చి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయని, ప్రస్తుత కరోనా  కూడా చైనా నుంచే వచ్చిందని  అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రయన్‌ ఆరోపించారు.

చైనాలో  మృతుల సంఖ్య ఐదువేల లోపే ఉండటం అనుమానాలను రేకెత్తిస్తున్నది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయడం వల్లనే తగ్గించగలిగామన్న మాటలను ఏ దేశమూ నమ్మే పరిస్థితి లేదు. వైరస్‌ పుట్టుకపై పరిశోధన జరిపేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తలపై ఉక్కుపాదం మోపింది. దీంతో వైరస్‌ విషయంలో చైనా వైఖరి సందేహాస్పదంగా మారింది.  

తనపై వస్తున్న విమర్శలపై చైనా ఎదురుదాడికి దిగుతున్నది. నెదర్లాండ్స్‌కు వైద్య సహాయం నిలిపివేస్తామని గత వారం హెచ్చరించింది. 160 బిలియన్‌ డాలర్లకు దావా వేసిన జర్మనీ పత్రిక ‘బిల్డ్‌'పై ఆ దేశంలోని చైనా రాయబారి ఘర్షణకు దిగారు. కరోనాపై దర్యాప్తు జరుపుతామన్న ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా చైనా అధికార మీడియా కొన్నిరోజులుగా అనేక కథనాలను ప్రచారం చేస్తున్నది. 

సన్నిహిత సంబంధాలున్న ఫ్రాన్స్‌పైనా చైనా దౌత్యవేత్తలు అనుచిత విమర్శలు చేశారు.  జిన్‌పింగ్‌కు ఫోన్‌చేసి కృతజ్ఞతలు తెలుపాలని పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్‌ దూడాపై చైనా రాయబారి ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి.