నెలల తరబడి లాక్‌డౌన్‌ పొడిగించలేం  

మనది పేదదేశం కావడంతో నెలల తరబడి లాక్‌డౌన్‌ను పొడిగించలేమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని స్పష్టం చేశారు. మనం కరోనాతోపాటు ఆర్థిక యుద్ధం కూడా చేయాలని గుర్తు చేసారు. 

కాగా, వైరస్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని, ఇది సాధారణ వైరస్‌ కాదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ సహజంగా పుట్టింది కాదని,  దీనిని యోగశాలలోప్రకృత్రిమంగా సృష్టించారని అమెరికాతోపాటు అనేక దేశాలు బలంగా నమ్ముతున్న విషయం తెలిసిందే. 

ఒక ఆంగ్ల వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఈ వైరస్‌ సహజమైనది కాదు. దానిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. అందుకే, ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు’’ అని తెలిపారు. ఇప్పుడు ప్రపంచంతోపాటు, భారత్‌ కూడా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమైందని చెబుతూ అదే సమయంలో... లాక్‌డౌన్‌ను ఎక్కువకాలం కొనసాగించలేమని కూడా తేల్చి చెప్పారు. 

‘‘మనం కరోనాతోపాటు ఆర్థిక పరిస్థితులతోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది. మనది పేద దేశం. ఏ నెలకు ఆ నెల లాక్‌డౌన్‌ పొడిగించుకుంటూ వెళ్లలేం’’ అని చెప్పారు. కరోనాతో కలిసి జీవించే ‘కళ’ను నేర్చుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. 

‘‘ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ఒకరికీ ఇంకొకరికీ మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. ఇళ్లు, ఆఫీసుల్లోకి వెళ్లిన ప్రతిసారీ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి. బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, మాల్స్‌ త్వరలోనే తెరుచుకుంటాయని భావిస్తున్నాను. అయితే... ఈ నిబంధనలన్నీ మనం పాటించాలి’’ అని గడ్కరీ సూచించారు. 

అనేక దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని గడ్కరీ చెప్పారు. ‘‘వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వస్తుందని ఆశిద్దాం. వ్యాక్సిన్‌ వస్తే కరోనా  భయం పోతుంది. ప్రజల్లో విశ్వాసం నింపవచ్చు. అలాగే... వైరస్‌ను వేగంగా గుర్తించే పరీక్షా పద్ధతి కూడా అందుబాటులోకి రావాలి’’ అని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో వలస కూలీలు భయంతో తమ స్వప్రాంతాలకు బయలుదేరారని చెబుతూ ఆర్థిక లావాదేవీలు మొదలైతే మళ్లీ పనులకు వెళతారని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు.