పోతిరెడ్డిపాడుపై కేంద్ర మంత్రికి సంజయ్ ఫిర్యాదు   

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎత్తిపోతల సామర్థ్యం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 

సంజయ్ లేఖకు సత్వరమే స్పందించిన కేంద్ర మంత్రి , వెంటనే ఈ అంశంపై విచారణ జరిపి రెండు రోజుల్లో వాస్తవాలను వివరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ను ఆదేశించారు.  

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును ఆపలేని  అసమర్థ  కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ బుధవారం నిరసన దీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష జరిపారు. 

కృష్ణానది ప్రాజెక్టులపై టీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తమ తమ ఇండ్లల్లోనే నిరసన దీక్ష కొనసాగిస్తున్న పాత మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలోని  బిజెపి నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా నిరసన దీక్షలు జరిపారు. 

కేఆర్ఎంబీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ జీవో 203ను ఏపీ ప్రభుత్వం జారీచేసినదని సంజయ్ విమర్శించారు. తాజా జీవోతో పాత రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలపై దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సాగునీటి విషయంలో తెలంగాణ ప్రయోజనాలు విస్మరించిన సీఎం కేసీఆర్ కృష్ణ నదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నీటిని సైతం పూర్తిగా వినియోగించుకోవడంలోనూ విఫలం అవుతున్నారని ధ్వజమెత్తారు.