ఎంఎస్ఎంఇ లకు రూ 3 లక్షల కోట్ల రుణాలు 

* ఈపీఎఫ్ చెల్లింపుదారులకు ఊరట  

* మరో 3 నెలలు పిఎఫ్ కేంద్రమే చెల్లిస్తుంది 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్యేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. వాటికి రుణాలు ఇచ్చేందుకు రూ. 3 లక్షల కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రాత్రి ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజి వివరాలను తెలుపుతూ ఎంఎస్‌ఎంఇ కింద ఇచ్చే రుణాలకు కేంద్రం హామీ ఇస్తుందని తెలిపారు. 

అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. 45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా చెప్పారు. 

అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.

ఆర్ధికంగా సంక్షోభంలో చిక్కుకున్న  విద్యుత్‌ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలను వెంటనే తీరుస్తామని చెబుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. 

ఎంఎస్ఎంలకు అవకాశాలు మెరుగు పరచడం కోసం రూ 200 కోట్ల వర్కౌ విలువ గల ప్రభుత్వ కొనుగోళ్ళకు గ్లోబల్ టెండర్లు పిలవరాదనీ, స్థానికంగానే పిలవాలని నిర్ణయించినట్లు సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్ఎంల నిర్వచనం కూడా మారుస్తున్నట్లు చెప్పారు. 

ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులకు రూ. 30 వేల కోట్లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. 

కాగా, రూ 15వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం మూడు నెలల పాటు  కేంద్రం ఇవ్వనుంది. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. మరోవంక, బిజినెన్, వర్కర్ల ఈపీఎఫ్ కంటిబ్యూషన్‌ను మూడు నెలల పాటు తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం రూ.6,750 కోట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు (లిక్విడిటీ సపోర్ట్) తెలిపారు. 

ఈపీఎఫ్ఓ కిందకు వచ్చే 6.5 లక్షల సంస్థలకు, 4.3 కోట్ల ఉద్యోగులకు ఈ పథకం వల్ల ఉపశమనం కలుగుతుందని మంత్రి తెలిపారు. ఆ ప్రకారం యజమానులు, ఉద్యోగులకు రూ.750 కోట్ల మేరకు లిక్విడిటీ సపోర్ట్ 3 నెలల పాటు లభిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  

టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ స్కీమ్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిచ్చింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.