లాయ‌ర్లు, జ‌డ్జిల డ్ర‌స్ కోడ్ మార్పు!

న్యాయవాదులు, న్యాయమూర్తులు అన‌గానే అంద‌రికీ మొద‌ట గుర్తొచ్చేది బ్లాక్ జాకెట్, పైన పెద్ద కోటుతో ఉన్న డ్ర‌స్ కోడ్. ఇప్పుడు క‌రోనా ప్రభావంతో ఆ డ్ర‌స్ కోడ్ మారిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వైట్ ష‌ర్ట్, బ్లాక్ ప్యాంట్ త‌ప్ప వారి మిగిలిన‌వి కొన్నాళ్ల‌పాటు వారికి దూరం కాబోతోన్నాయి. 

దుస్తుల‌పై కూడా క‌రోనా వైర‌స్ కొన్ని గంట‌ల పాటు బ‌తికే చాన్స్ ఉంద‌ని ప‌లు ప‌రిశోధ‌న సంస్థ‌లు చెబుతున్న నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తిని నియంత్రణ చేసే చ‌ర్య‌ల్లో భాగంగా సుప్రీం కోర్టు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లో దీనికి సంబంధించి ఉత్త‌ర్వ‌లు జారీ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం చాలా రోజులుగా సుప్రీం కోర్టు నేరుగా విచార‌ణ‌లు చేప‌ట్ట‌డం నిలిపేసింది. వీడియో కాన్ఫ‌రెన్స్ ప‌ద్ధ‌తిలో అత్య‌వ‌స‌ర కేసుల వాద‌న‌ల‌ను మాత్ర‌మే వినిపించేందుకు లాయ‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చింది. 

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ఓ కేసుకు సంబంధించి సీనియ‌ర్ లాయ‌ర్ క‌పిల్ సిబాల్ వాద‌న‌లు వినిపిస్తుండ‌గా లాయ‌ర్లు, జ‌డ్జిల డ్ర‌స్ కోడ్ మార్పు గురించి సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కామెంట్ చేశారు. కొన్నాళ్ల‌పాటు బ్లాక్ గౌన్, జాకెట్ వేసుకోక‌పోవ‌డం మేల‌ని సూచించారు. 

ఆ పెద్ద పెద్ద డ్ర‌స్ ల వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు. కాగా, బుధ‌వారం కోర్టు విచార‌ణ‌ల సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నంలోని న్యాయ‌మూర్తులంతా కేవ‌లం వైట్ ష‌ర్ట్, బ్లాక్ ప్యాంట్ మాత్ర‌మే వేసుకుని క‌నిపించారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కూడా న‌ల్ల కోటు లేకుండా క‌నిపించారు.