10 కోట్ల మందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్  

ఆరోగ్యసేతు యాప్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందుబాటులోకి వచ్చిన 41 రోజుల్లోనే 10 కోట్ల మందికి చేరువైంది. ఈ విషయాన్ని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. 

ఆరోగ్యసేతు యాప్‌ను ఇప్పటి వరకు 10కోట్ల రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన తెలిపారు. తొలి మూడు రోజుల్లోనే 50 లక్షల మంది ఇన్‌స్టాల్ చేసుకోగా, ఈ వారం ప్రారంభంలోనే ఆ సంఖ్య 9.8 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. 

గత ఏప్రిల్ 2న ప్రారంభమైన యాప్ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. ఆరోగ్యసేతును మొదట్లో ఐచ్ఛికం చేసినా... తర్వాత కొన్ని కార్యాలయాల్లో చేసేవారికి తప్పనిసరి అంటూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, పౌర సంస్థలు, నీతి అయోగ్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.  

కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ యాప్‌ను రూపొందించింది. ఐవోఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే  ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే ఈ యాప్ అప్రమత్తం చేసి హెచ్చరిస్తుంది. 

అత్యంత సులభంగా వినియోగించేందుకు వీలుగా దీన్ని 11 భాషల్లో రూపొందించారు. ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల వినియోగదారులు కరోనాపై అప్రమత్తం కావడంతో పాటు.. అటు ప్రభుత్వానికి కూడా సాయం చేసిన వారవుతారు.