కరోనా సామూహిక వ్యాప్తిపై ఐసీఎంఆర్ సర్వే 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (సామూహిక వ్యాప్తి) దశకు రాలేదని కేంద్రం, ఐసీఎంఆర్ బలంగా వాదిస్తూ వస్తున్నప్పటికీ గత వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. 

పైగా, గత వారం రోజులుగా నమోదవుతోన్న వివరాల మేరకు ‘పాజిటివ్’గా నిర్ధారణ అవుతోన్న వాళ్లలో చాలా మందికి ప్రయాణ చరిత్ర లేకపోవడం వంటి పరిణామాలతో కేంద్రం అప్రమత్తమైంది. దానితో భారత్ మూడో దశలోకి, అంటే సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

దానితో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)’ కమ్యూనిటీ ఆధారిత సర్వేను  చేపట్టింది.  దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ర్యాండంగా ఎంపిక చేసుకున్న 69 జిల్లాల్లో దశలవారీగా ఈ సర్వేను నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) సహకారంతో చేపట్టిన ఈ సర్వేకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. 

లాక్ డౌన్ విధించి ఇప్పటికి యాభై రోజులు పూర్తయినా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70 వేలకు దాటగా, వారిలో 22,454 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2,293 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008. 

సోమవారం రికార్డు స్థాయిలో నాలుగు వేల పైచిలుకు కొత్త కేసులు నమోదు కాగా... మంగళవారం కూడా కొత్తగా 3,604 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తాజా సర్వేలో భాగంగా కొవిడ్-19 కేసుల నమోదును బట్టి ఆయా జిల్లాల్లోని 10 క్లస్టర్ల నుంచి 400 మందిని ర్యాండంగా ఎంపిక చేసి యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు చేపడతారు.

అందరూ 18 ఏళ్లు పైబడిన, మొత్తం 24 వేల మందికి పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తి తీరుపై ఒక అంచనాకు వస్తారు. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తయారుచేసిన తొలి స్వదేశీ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 

ఇది కాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని జనాభా ఆధారిత సెరో-సర్వే కూడా యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ తాజా సర్వే కోసం తెలంగాణలోని కామరెడ్డి, జనగామ, నల్గొండ జిల్లాలను, ఏపీ నుంచి కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాలను ఎంపిక చేశారు. తుది ఫలితాలను బట్టి భారత్ స్టేజ్-3 లోకి ప్రవేశించిందీ, లేనిదీ నిర్ధారణ అవుతుందని ఐసీఎంఆర్ భావిస్తోంది.