16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ 

ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న రెండోదశ వండేభారత్ మిషన్ లో 31 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి 149 విమానాల ద్వారా ఎయిర్ ఇండియా తీసుకు రానున్నది. 

ఎయిర్ ఇండియాకు రెగ్యులర్ విమానసర్వీసులు లేని ఉక్రెయిన్, అర్మేనియా, కిర్గిజిస్థాన్ , బెలారస్, జార్జియా, కజకిస్థాన్,తజికిస్థాన్ ,నైజీరియా వంటి దేశాల నుంచి కూడా ఇప్పుడు భారతీయులను తీసుకు వస్తారు. 

వీరితోపాటు అమెరికా, అరబ్ ఎమిరేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, సింగపూర్, రష్యా దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకు వస్తారు. వందేభారత్ మిషన్ మొదటి దశలో 6037 మంది భారతీయులను 31 విమానాల ద్వారా ఎయిర్ ఇండియా, దాని అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు ఈ నెల 7 నుంచి ఐదు రోజుల్లో తీసుకు రాగలిగాయి. 

మొదటి దశలో అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, సింగపూర్, సౌదీ, అరేబియా, కువైట్, ఫిలిప్పైన్స్, అరబ్ ఎమిరేట్స్, మలేసియా తదితర 12 దేశాల నుంచి 14,800 మంది భారతీయులను తీసుకు రావలసి ఉంది. దీని కోసం ఎయిర్ ఇండియా 42, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 24 విమానాలను వినియోగించ వలసి ఉంది. అయితే రెండో దశలో అదనంగా 149 విమానాలను వినియోగిస్తున్నారు.