రోజుకు లక్ష కోవిడ్-19 టెస్టులు చేసే సామర్థ్యం

రోజుకు లక్ష కోవిడ్-19 టెస్టులు చేసే సామర్థ్యం ఇప్పుడు భారత్‌కు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూకశ్మీర్‌లోని వివిధ జిల్లాల సీనియర్ అధికారులతో మంత్రి మాట్లాడుతూ  కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెబుతూ రికవరీ రేటు ఈ రోజు 31.7 శాతంగా ఉన్నట్టు తెలిపారు.

కరోనా వైరస్‌పై పోరులో భారత్ అద్భుత పురోగతి సాధిస్తోందని, దేశంలో కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా 3.2 శాతంగా ఉందని వివరించారు.  మిగిలిన ప్రపంచ దేశాల్లో 7 నుంచి 7.5 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. 

భారత్‌లో ఇప్పటివరకూ  70, 756 కేసులు నమోదయ్యాయి. 22, 455 మంది రికవర్ అయ్యారు. 2,293 మంది చనిపోయారు.  క‌రోనా మ‌హ‌మ్మారిపై భార‌త్ అన్ని ర‌కాలుగా స‌మ‌ర్థ‌వంత‌మైన పోరాటం చేస్తోంద‌ని మంత్రి పేర్కొన్నారు. 

వైర‌స్ ను అంతం చేసేందుకు ప‌రిష్కారం కోసం భార‌త ప్ర‌భుత్వం, శాస్త్ర‌వేత్త‌లు, స్టార్ట‌ప్స్ మొద‌లు పెద్ద‌పెద్ద కంపెనీల వ‌ర‌కూ నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్, డ్ర‌గ్స్ పై ప‌రిశోధ‌న‌ల‌తో పాటు దేశంలోనే కరోనా టెస్టు కిట్లు, పీపీఈలు, రెస్పిరేట‌రీ ప‌రిక‌రాల త‌యారీ వేగంగా జ‌రుగుతోంద‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు.