ఆత్మ రక్షణలో చంద్రబాబు... ఐటి దాడుల బూచి

ఎన్నికలు సమీపిస్తున్న కొలది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు  తీవ్ర ప్రజావ్యతిరేకత ఎడురవుతున్నదనే భయం పట్టుకోంటున్నది. ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతో ఆత్మరక్షణలో పడుతున్నారు. నాలుగేళ్ళుగా తాము ప్రజలకు ఏమి చేసామో చెప్పుకొని ఓట్లు అడిగే సాహసం చేయలేక పోతున్నారు. పైగా తమ పాలనలో పెచ్చు పెరిగిన అవినీతి, తమ కుటుంభ సభ్యులపై మొహరిస్తున్న అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దానితో ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ప్రత్యర్ధులపై బురద జల్లే ప్రయత్నంలో పడ్డారు.

మొన్నటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మోసం చేసారు అంటూ ఊరార ప్రచారం చేస్తూ చంద్రబాబు గడిపారు. అది అరిగిపోయిన పాత రికార్డుగా మారడంతో ప్రయోజనం ఉండటం లేదని కొత్తగా కేంద్రం తమ పార్టీ వారిపై ఐటి దాడులు జరుపుతున్నదని అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఐటి అధికారులు జరుపుతున్న సోదాలు అన్ని తనను ఇరికించడం కోసమే అన్నట్లు ప్రచారం చేపట్టారు.

మామగారు ఎన్టీఆర్  రామారావు ఏ కాంగ్రెస్ వ్యతిరేకతపై తెలుగు దేశం పార్టీని ప్రారంభించారో ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తోనే పొత్తుకు సిద్దమవుతున్న చంద్రబాబునాయుడు అంత అవసరం ఏమొచ్చినదో చెప్పుకోలేక పోతున్నారు. చివరకు సొంత పార్టీ నేతలనే ఒప్పించలేక పోతున్నారు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితం అనుకున్న ఈ పొత్తు తర్వాత ఆంధ్రలో కుడా ఉండే అవకాశం కనిపిస్తున్నది.

ఎన్టిఆర్ తెలుగు దేశం పార్టీని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ ఎమ్యెల్యేగా ఉన్న చంద్రబాబు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోలేదు. అందుకనే మామపైన పోటీకి కూడా సిద్దం అంటూ సవాల్ కూడా విసిరారు. తాను ఓడిపోవడం, మామ ముఖ్యమంత్రి కావడంతో దొడ్డిదారిని ఆ తర్వాత పార్టీలో ప్రవేశించి, చివరకు మామనే బయటకు గెంటివేసి మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని అస్తగతం చేసుకొన్నారు.

అప్పటి నుండి వీలు చిక్కినప్పుడు అల్లా కాంగ్రెస్ వారిని పార్టీలో చేర్చుకోంటూ, వారికి కీలక పదవులు అప్పజెబుతూ, మామగారితో కాలం నుండి పార్టీలో ఉంటున్న వారిని పక్కకు నెడుతూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ తోనే పొత్తుకు సిద్దమయ్యారు. పైగా కాంగ్రెస్ తో పొత్తుకోసం పొంతనలేని కారణం చెబుతున్నారు.

ముందు కలసి పనిచేద్దామని కెసిఆర్ ను కోరానని, ఆయన ఒప్పుకోక పోవడంతో కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దపడ్డాను అంటూ కుంటి సాకులు చెబుతున్నారు. అంటే కేవలం రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ మనుగడ కోసమే ఈ పొత్తు ఎర్పర్చుకోన్నం గాని ఎటువంటి విధానపరమైన అంశం అందులో ఇమిడి లేదని చంద్రబాబు స్వయంగా అంగీకరించిన్నట్లుగా భావించవచ్చు.

బిజెపికి దూరం కావడంతో జాతీయ స్థాయిలో తమ తప్పులను కప్పిపుచ్చు కోవడానికి ఏదో ఒక కవచం కావాలని కాంగ్రెస్ తో చేతులు కలిపిన్నట్లు ఆయన మాటలలోనే అర్ధం అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో చేతులు కలిపిన వారు, రేపు ఆంధ్ర ప్రదేశ్ లో సహితం తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కల్పిస్తానని రాహుల్ గాంధీ అన్న మాటలను చూపి పొత్తుకు సిద్దపదబోమని హామీ ఉన్నదా ? ఇప్పటి వరకు పొత్తు తెలంగాణకే పరిమితం అనే మాట చంద్రబాబు నోటి ద్వారా వచ్చిందా ?

ఈ విషయమై సొంతపార్టీ వారికి, ఎన్టిఆర్ కాలం నుండి పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రజలకు  సమాధానం చెప్పుకోలేక కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు మరింత తెలివిగల వారని గ్రహించాలి.

హైదరాబాద్ లో గతంలో సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు కుమారుడు ఇంటి పైననే కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు జరిపాయి. ప్రస్తుతం టి ఆర్ ఎస్ లో ఉన్న ఖమ్మం ఎంపి పైన కుడా సోదాలు జరిపాయి. విజయవాడలో సోదాలు జరిపిన సంస్థలలో పోతుల రామారావుకు చెందినవి తప్ప టిడిపికి చెందిన మరెవ్వరి సంస్థలు లేవు. వైసిపి నేతలు చెందిన సంస్థలు కుడా ఉన్నాయి. వారెవ్వరూ రాజకీయ దాడులుగా వీటిని పరిగణించడం లేదే ?

వారంతా ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని వెంకవేసుకొని వస్తూ, టిడిపి నాయకులపైన దాడులు జరుగుతున్నాయని అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం, ఈ విషయమై ప్రత్యేకంగా మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడటం గమనిస్తే చంద్రబాబునాయుడులో పెరుగుతున్న అబద్రతా భావాన్ని వెల్లడి చేస్తుందని ఆ పార్టీ వారే వాపోతున్నారు.

నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి అనుకొంటే టిడిపి ప్రభుత్వంలో అనేక అక్రమాలు దొరకక మానవు. చివరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆమె అల్లుడు పైన ఉన్న కేసుల విషయంలో సహితం చట్ట పరంగా న్యాయ పక్రియ కొనసాగడం మినహా ప్రభుత్వ పరంగా రాజకీయ జోక్యం చేసుకొన్నట్లు ఎక్కడ లేదు. అటువంటిది చంద్రబాబు ఎందుకంతగా ఉలిక్కి పడుతున్నారు ?