తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడుపేచీ

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గత సంవత్సరంగా కొనసాగుతున్న స్నేహానికి గండి పడినట్లయింది. రెండు రాష్ట్రాల మధ్య గల జలవివాదాలు సామరస్యంగా పరిష్కరించుకొంటామని ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సార్లు కలసి ప్రకటించారు. అధికారుల స్థాయిలో కొన్ని మంతనాలు కూడా జరిగాయి. 

అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడుకు తరలిస్తూ జిఓ జారీ చేసిందని అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. దీనిపై న్యాయపోరాటానికి సై అని ప్రకటించారు. ఇంతకు ముందు వెనుకబడిన రాయలసీమకు జలాలు ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. 

ఏపీ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రతిపాదించిన కొత్త ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టు కడుతున్నారని, ఆ ప్రాజెక్టును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

విభజన చట్టం అంశాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు కడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టరాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. బోర్డు చైర్మన్ ను కోరింది.   

ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203 జీవో అక్రమమని, వెంటనే నిలిపివేయాలని కోరింది. కేఆర్‌ఎంబీ అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతితోనే కొత్త ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాలని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించారని తెలంగాణ సర్కార్ చెప్పింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టాలని తెలంగాణ సర్కార్‌ కోరింది. 

మరోవంక ఈ వివాదాన్ని కేసీఆర్ తో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ వాదనని కృష్ణా బోర్డు ముందు బుధవారం వినిపించాలని జగన్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణాజలాలను ఎత్తి కుడి ప్రధాన కాల్వలో పోయడంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకుగాను విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను సైతం 30వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచాలని తీర్మానించింది. 

ఈ పనులకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయానికి పాలనా ఆమోదం తెలుపుతూ ఈ నెల 5వ తేదీన జీవో జారీచేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల జలాల తరలింపు లక్ష్యంగా అందులో పేర్కొంది. కానీ ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి ఐదున్నర టీఎంసీల వరకు జలాల్ని తరలించే వ్యవస్థ ఉండగా అదనంగా ఈ పనులు చేపట్టడంతో 1.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో రోజుకు 10 టీఎంసీల జలాల్ని ఏపీ తరలించుకుపోతుందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.