భూముల కొనుగోలులో భారీ అవినీతి 

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కోరుకొండ మండలంలో భూముల కొనుగోలులో భారీ అవినీతి జరిగినదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్రాసిన లేఖలో  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఆ భూముల కొనుగోలును రద్దు చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు. 

ఈనెల 9వ తేదీన సీఎం జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం భూమి కొనుగోలు చేసిందని చెప్పారు. రాజమహేంద్రవరం సమీపంలో అనాదిగా ఉన్న ముంపు ప్రాంతాన్ని పేదల కోసం సబ్ కలెక్టర్ ఎంపిక చేయగా, వర్షాకాలం వస్తే మినిగిపోయే ఈ ప్రాంతం నివాస యోగ్యం కాదని పేర్కొన్నారు. 

ఈ విషయం అక్కడి అధికారులకు, స్థానిక పెద్దలకు తెలిసినప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేశారని వీర్రాజు తన లేఖలో ఆరోపించారు. ఈ భూమి కొనుగోలు అంశంలో కూడా అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొంత పెద్దలకు మేలు చేసేందుకు పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

రూ.25 లక్షల విలువ చేసే భూమిని రూ.45 లక్షలకు కొనడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం వేశారని ధ్వజమెత్తారు.  రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.600 కోట్లు ఆదా చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అదే విధంగా ఈ స్థలం కొనుగోలుకు సంబంధించి వాస్తవాలను కూడా తెలుసుకోవాలని కోరారు. 

ఈ భూముల కొనుగోలులో దాదాపు రూ.250 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని వీర్రాజు ఆరోపించారు. ఈ భూముల కొనుగోలు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందే తప్ప.. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు.