కృష్ణా నీళ్ల దొంగతనాన్ని ఆపండి....!

నీళ్లు ,నియామకాలు ,నిధులు పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ స్వార్ధ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురి అయ్యే అవకాశం ఉందని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అపర భగీరథుడు గా తన వందిమాగధులు  చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. 

ఇటీవల కాలంలో జగన్ కు  తానే మార్గదర్శకుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త లిఫ్ట్ గురించి తెలియకపోవడం తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడమే అని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఉత్తర తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దక్షిణ తెలంగాణను విస్మరిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. 

ఇప్పుడు కొత్త లిఫ్ట్ తో శ్రీశైలం నుండి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతే పాలమూరు, నల్లగొండ , రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగనుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

కొన్ని విషయాల్లో సంప్రదింపులు జరుపుకునే కెసిఆర్ జగన్ మాట మాత్రం చర్చించకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏడు వేల కోట్లతో ఫస్ట్ ఫేస్ కింద పనులు జరపాలని నిర్ణయం తీసుకొంటారా అంటి లక్ష్మణ్ నిలదీశారు. 

కృష్ణా గోదావరి ట్రిబ్యున ళ్ళ ను తానే పద్ధతి ప్రకారం తీర్చిదిద్దాడని చెప్పే కెసిఆర్ కు చెప్పకుండా దక్షిణ తెలంగాణలో మూడు జిల్లాలను ఎండబెట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని బిజెపి నేత స్పష్టము చేశారు. 

ఓ వైపు జగన్ కెసిఆర్ అన్నదమ్ములు అంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం, ఆంధ్ర తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వీళ్ళిద్దరికీ పరోక్షంగా దగ్గరగా ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుందని లక్ష్మణ్ చెప్పారు. కాళేశ్వరం కింద చేపట్టే ప్రాజెక్టులన్నీ తన ఘనతగా చెప్పుకునే కెసిఆర్ ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వంచను ఎలా సమర్థించుకుంటాడని ప్రశ్నించారు. 

"నువ్వు కొట్టినట్లు చెయ్ నేను ఏడ్చినట్లు చేస్తా "అన్న సామెత లాగా నడుస్తు ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని లక్ష్మణ్ కోరారు.  ఇప్పటికైనా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎంపీలు మాట్లాడకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.