ప్రపంచీకరణ పాతికేళ్లకే కుప్పకూలింది

కరోనా మహమ్మారితో ప్రపంచీకరణ పట్ల ఉన్న అపోహాలు తొలగిపోయాయని చెబుతూ అసలు అదెప్పుడు ఆచరణీయం కాదని ప్రముఖ ఆర్ధిక వేత్త, తుగ్లక్ పత్రిక సంపాదకులు ఎస్ గురుమూర్తి స్పష్టం చేశారు.

 'భారతీయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం: సవాళ్లు, అవకాశాలు' అంశంపై ఆర్గనైజర్, పాంచజన్య పత్రికలు దేశ వ్యాప్తంగా గల సుమారు 40 వార్తా సైట్ లతో కలసి  జరిపిన వెబనార్ ప్రసంగం చేస్తూ ప్రతి దేశం తమ స్థానిక పరిస్థితులకు అవసరమైన స్వదేశీ నమూనాను అనుసరించాలని నేడు మొత్తం ప్రపంచం గుర్తించిందని చెప్పుకొచ్చారు. 

ప్రపంచీకరణ కేవలం ఆర్ధికవేత్తలకు మాత్రమే పరిమితమైన ఆలోచన అని తెలుపుతూ అందులో భాగంగా ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు కోమాలో ఉండిపోయందని గుర్తు చేశారు. అమెరికా, జపాన్, భారత్ వంటి దేశాలు తమ ప్రతినిధులను పంపక పోవడంతో వివాదాల పరిష్కార యంత్రాంగం స్తంభించి పోయినదని పేర్కొన్నారు. 

చైనా వంటి నిరంకుశ పాలనలకు అవకాశంగా మారిన `ప్రపంచ సరఫరా చైన్' ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నదని అంటూ పాతికేళ్లలో ఈ విధానం కుప్పకూలినదని స్పష్టం చేశారు. అదే విధంగా చరిత్రలో వలసవాదం, వర్తకంతో ఆధిపత్యం, మార్క్సిజం వంటివి కూడా ఎక్కువకాలం నిలబడలేదని చెప్పారు.

 ప్రపంచీకరణ పేరుతో వివాదాలకు  అవకాశం లేని ఆదర్శ ప్రపంచం ఏర్పడుతుందని భావించారని అయితే ఎటువంటి ఒప్పందాలైనా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉండాలి తప్ప నిరంకుశ వ్యవస్థలతో ప్రయోజనం ఉండబోదని నేడు అందరికి అర్ధమైనదని గురుమూర్తి గుర్తు చేశారు. 

నేడు కరోనా అనంతరం మరో నూతన అంతర్జాతీయ, రాజకీయ, ఆర్ధిక వ్యవస్థ అవతరించే అవకాశం ఉన్నదని గురుమూర్తి పేర్కొన్నారు. అయితే అదే రూపు తీసుకొంటుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రపంచీకరణ నమూనాలో అందరూ  తమ స్థానిక సంస్కృతి, తాత్విక ఆలోచనలు, జీవన విధానాలు వదులుకొంటేనే నూతన అంతర్జాతీయ వ్యవస్థలో భాగస్వాములు కాగలరని అభిప్రాయం నెలకొన్నదని పేర్కొన్నారు. 

అయితే ఇటువంటి విధానం ఆచరణ సాధ్యం కాదని అనేక సంకేతాలు  వెలువడుతునా మనం గుర్తించడం లేదని, మనదేశంలో ఆ విషయాలపై ఎటువంటి చర్చలు జరగడం లేదని గురుమూర్తి విచారం వ్యక్తం చేశారు. అందరికి ఒకే వ్యవస్థ అనుకూలం కాబోదని, ఎవ్వరికీ వారు తమ స్థానిక పరిస్థితులను బట్టి తమ నమూనాలను ఏర్పాటు చేసుకోవాలని జి20 ప్రకటించినట్లు తెలిపారు. 

అందరికి  ఒకే నమూనా సాథ్యం కాదని 2010లోనే ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసినదని ఆయన చెప్పారు.  ఐ ఎం ఎఫ్, డబ్ల్యు టి ఓ వంటి సంస్థలు కూడా అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాయని అన్నారు. 

నీతి ఆయోగ్ మౌలిక పత్రంలో సహితం అందరికి ఒకే నమూనా పనికిరాదని స్పష్టం చేసినా మన ఆర్ధిక సంస్థలు గాని, అధికారులు గాని, ఆర్ధిక వేత్తలు గాని పరిగణలోకి తీసుకోకుండా ఫలితం లేని పాశ్చాత్య  నమూనాలోనే  వెడుతున్నారని గురుమూర్తి విచారం వ్యక్తం చేశారు. అందువల్లన భారత్ సుదీర్ఘకాలం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినదని తెలిపారు. 

ఉదాహరణకు ఇప్పటికి భారత్ తన సొంత కరెన్సీ ని ముద్రించుకోలేక పోతున్నదని పేర్కొన్నారు. రూపాయిని రిజర్వు బ్యాంకు గాని, భారత్ ప్రభుత్వం గాని కాకుండా  డాలర్ నియంత్రిస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. ద్రవ్య లోటు 3 శాతం ఉండాలని ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రశ్నించారు. అనేక దేశాలు ఈ పరిమితిని పాటించడం లేదని గుర్తు చేశారు.