నేడే జాతి నుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మోదీ నిన్ననే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి చర్చించారు. మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 దేశంలో ప్రస్తుతం మూడోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 17తో ఇది ముగియనుంది. మార్చి నెల 24 అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్ తొలిదశ 21 రోజుల పాటు కొనసాగింది. ఏప్రిల్ 15న మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఆ తర్వాత మరో రెండు వారాలు పొడిగించారు. నేడు మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తారని భావిస్తున్నారు. 

రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది ఐదోసారి.   

దేశవ్యాప్త లాక్‌డౌన్‌  నేటితో 49వ రోజుకు చేరుకుంది. దేశంలో 70,756 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. కోవిడ్‌-19 కారణంగా దేశంలో ఇప్పటి వరకు 2,293 మంది మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీ రాష్ర్టాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.