భారత్ వైపు చూస్తున్నటెక్‌ దిగ్గజం యాపిల్‌  

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా నుంచి తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో ఐదో వంతు భాగాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నది.

 ప్రస్తుతం తమ స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గ్యాడ్జెట్ల తయారీ కాంట్రాక్టులను ఫాక్స్‌కాన్‌, విస్ట్రన్‌ లాంటి సంస్థలకు ఇస్తున్న యాపిల్‌.. భారత్‌లో దాదాపు 4 వేల కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేందుకు ఈ కాంట్రాక్టర్లను ఉపయోగించుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

పీఎల్‌ఐ పథకంలో కొన్ని అవరోధాలున్నాయని, వాటిని తొలగించాలని యాపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు చేసిన విజ్ఞప్తికి భారత  ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారవర్గాలు వెల్లడించాయి. పీఎల్‌ఐ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏ కంపెనీ అయినా 2020 నుంచి 2025 మధ్యకాలంలో దశలవారీగా కనీసం వెయ్యి కోట్ల డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్లను తయారు చేయాల్సి ఉంటుంది. 

భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో స్వల్ప వాటాను కలిగివున్న యాపిల్‌.. ప్రధానంగా ఎగుమతుల నిమిత్తమే తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అధిక భాగాన్ని చైనా నుంచి భారత్‌కు తరలించనున్నట్టు తెలుస్తున్నది. యాపిల్‌ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్‌-7, ఐఫోన్‌-ఎక్స్‌ఆర్‌ మోడళ్లను తయారు చేస్తున్నది. 

గతంలో ఐఫోన్‌-ఎస్‌ఈ, ఐఫోన్‌-6ఎస్‌ మోడళ్లను కూడా భారత్‌లో తయారు చేసినప్పటికీ యాపిల్‌ తమ అంతర్జాతీయ ఉత్పత్తుల జాబితా నుంచి ఆ రెండు మోడళ్లను తొలగించింది. గత త్రైమాసికం చివరి నాటికి భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో యాపిల్‌ 62.7 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఇంటర్నేషనల్‌ డాటా కార్పొరేషన్‌ కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. 

ప్రస్తుతం భారత్‌లో రీసెల్లర్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్న యాపిల్ వచ్చే ఏడాది భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ గతనెల తమ పెట్టుబడిదారులకు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో యాపిల్‌ ఏటా దాదాపు 150 కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్లను అమ్ముతున్నది. వీటిలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే స్థానికంగా తయారవుతున్నాయి. 

చైనాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద సంస్థల్లో యాపిల్‌ ఒకటి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ చైనాలో దాదాపు 22 వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసింది.