ప్రధాని మోదీ చొరవను కొనియాడిన కేసీఆర్ 

కరోనా కట్టడి విషయంలో కేంద్రం సహకరించడం లేదని అంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వారం రోజులలోపే కరోనా సమయంలో ప్రధాని చూపుతున్న చొరువను కొనియాడారు. ముఖ్యమంత్రులతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటూ వలస కూలీల కోసం శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.

కాగా, కరోనా  కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కేసీఆర్ సూచించారు. పాజిటివ్, యాక్టివ్‌ కేసులు లేని జిల్లాల్ని ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా మార్చాలని కేసీఆర్‌ కోరారు. అంతేకాదు రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని మోదీకి కేసీఆర్‌ చెప్పారు. 

ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని, రైళ్లలో వచ్చిన ప్రయాణికులకు క్వారంటైన్‌ చేయడం కూడా కష్టమని చెప్పారు. రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేసీఆర్‌ కోరారు.  

కాగా, క‌రోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయిని చెబుతూ  హైదరాబాద్ కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయని చెప్పారు. జూలై-ఆగస్టు నెలల్లో హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.