కరోనాపై పోరులో రాష్ట్రాలదే కీలక పాత్ర  

కరొనపై పోరులో రాష్ట్రాలదే కీలక పాత్ర అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కలిసి పనిచేయాలని పిలుపిచ్చారు. ముఖ్యమంత్రులతో ఐదవ సారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. 

ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుడి సహజ లక్షణం అని పేరొక్నటు వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలని సూచించారు. అదే సమయంలో కరోనా వైరస్‌ గ్రామాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. ఏ ప్రాంతంలోనైనా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. 

‘‘కరోనాపై పోరులో మనం విజయవంతమయ్యామని ప్రపంచం అంటోంది. ఈ యుద్ధంలో రాష్ట్రాలదే కీలక పాత్ర. బాధ్యతనెరిగి.. కరోనాను ధీటుగా ఎదుర్కొన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని మనం పదే పదే అప్రమత్తం చేస్తూ వచ్చాం. అయితే ఇంటికి వెళ్లాలని కోరుకుకోవడం మానవుని సహజ లక్షణం. అందుకే మన నిర్ణయాలను కొంతమేర మార్చుకున్నాం" అని ప్రధాని పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం గ్రామాలకు వైరస్‌ సోకకుండా చూసుకోవడమే మన ముందు ఉన్న అతిపెద్ద సవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ ఆవశ్యకతను వివరిస్తూ.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.