లాక్‌డౌన్‌ను పొడిగించమంటున్న సీఎంలు  

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ను పొడిగించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఐదోసారి జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని సూచించారు. 

బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా లాక్‌డౌన్ పొడిగింపును కోరుకుంటున్నారు. 

 తమిళనాడు రాష్ట్రానికి మే 31 వరకూ రైళ్లు నడపవద్దని, రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వవద్దని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, విమాన రాకపోకలకు కూడా అనుమతి ఇవ్వవద్దని ఆయన కోరారు.  

తెలంగాణలో ఇప్పటికే ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. పంజాబ్, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలు నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మూడోదశ ఈ నెల 17న ముగియనుంది. 

అయితే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తున్నది.